Powered By Blogger

Friday, 20 June 2014

రుధిరసౌధం 177


ఇది నిజంగా మీ పెద్ద మనసు బాబూ ... తెల్లారు ఝామున  సరస్వతి ఇంటికి చేరిపోనాది బాబూ .. అన్నాడు తాత .

ఏంటీ సరస్వతి ఇంటికి చేరిపోయిందా ? తాతా మీరు చెబుతుంది నిజమేనా ? ఆశ్చర్యంగా అడిగాడు యశ్వంత్ .

శివ కూడా తాత వైపు ఆశ్చర్యం గా చూశాడు .

అవును బాబూ .. సరస్వతి ని , సత్యమ్మ ని ఇద్దర్ని దాత్రమ్మ .. తీసుకొచ్చింది .. ముగ్గురూ క్షేమం గా ఇంటి కాడ

ఉన్నారు .. ఆ మాట మీకు చెబుదామనే వచ్చాను .. అన్నాడు తాత .

నిజంగానా ? అంటూ యశ్వంత్ , శివ ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు .

అవును బాబూ .. సత్యమ్మ నీరసం గా ఉంది .. ధాత్రమ్మ కూడా నేనేచ్చో సరికి నిద్రపోతోంది .. బాగా అలసి పోనాది

పిల్ల ... తనకి , సరస్వతి కి తెలీదు కదా .. నిన్న ఏం జరిగిందో .. అందుకే ముందు మీరున్న ఇంటి కాడ కి వెళ్ళినారు

అక్కడ తాళం వేసుంది కదా .. పిల్లలు అందుకే సరాసరి మా ఇంటికి వచ్చేసినారు .. అన్నాడు తాత .

మంచి విషయం చెప్పావు తాత .. మా మనస్సులో భారం దింపావు .. అన్నాడు యశ్వంత్ .

యశ్వంత్ .. ముందీ విషయం నేను మురారికి చెప్పోస్తాను .. అన్నాడు ఆనందంగా శివ ..

అలాగే శివ అన్నాడు యశ్వంత్ .

బాబూ .. సరస్వతి ని భూపతే బంధించాడు ... భూపతి అన్నాయాలని  అడిగేటోల్లు లేరని ఇట్టమొచ్చినట్టు

చేస్తున్నాడు  ... మా సరస్వతి , నేను మీకు అండగా నిలబడతాం .. భూపతి తప్పు ఊరందరి మధ్య పెడదాం

అయ్యా ... అన్నాడు తాత .

తప్పకుండా తాతా ... మా దగ్గర మంచి సాక్ష్యం ఉంది .. ధాత్రి కి సిద్ధం గా ఉండమనండి ... మేము కాసేపట్లో

ఊరు లోకి వస్తాం .. భూపతి ఏంటో అందరి మధ్య నిరూపిస్తాం .. ఈలోపు భూపతి ఇంటి ముందు జనం పోగయ్యేలా

చూడు తాతా .. అన్నాడు యశ్వంత్ .

అలాగే బాబూ ... ఇన్నాళ్ళకి మీరాక వల్ల ఈ ఊరి పరిస్తితి మారితే అదే చాలు .. దానికి మీరు మా ప్రాణాలు

అడిగినా ఇస్తామయ్య .. అన్నాడు తాత ..

ప్రాణాలు ఎందుకు తాతా ... ? కొంచెం నమ్మకం .. కొంచెం ప్రేమ .. ఆ పైన మీ ఆశీర్వాదం మాకివ్వండి ? అది చాలు

అన్నాడు యశ్వంత్ .

మీ మాటలు నిజంగా చాలా సంతోషం ఇచ్చినాయయ్యా .. చాలు ... ఇప్పుడు నేనేల్తా .. పిల్లలకి మాట చెప్పాలె ..

ఊరోల్లందరినీ పోగు చేయాలే ... అన్నాడు తాత .

అలాగే తాత ... ధాత్రి , సరస్వతి లను సిద్ధం గా ఉండమనండి .. మేము వచ్చేస్తాం .. అన్నాడు యశ్వంత్ ..

అలాగే నయ్యా .. అని వెనుదిరిగాడు తాత .

ఇప్పుడుంది భూపతీ .. నీ పని సరి  ఈరోజుతో .. అందుకే అంటారు కొండ చిలువైనా చలి చీమల చేత జిక్కి చావదా

అని ... ఇప్పుడు బాలయ్య కూడా నీకు వ్యతిరేకంగా చెపుతాడు ... చెప్పేలా చేస్తాం .. అనుకున్నాడు కసిగా

యశ్వంత్ .

అతని పెదవులపై ఓ చిరునవ్వు విరిసింది ...

ముందు బాలయ్య పని చూడాలి అనుకుంటూ మహల్ వైపు నడిచాడు యశ్వంత్ .

ఇంకా ఉంది






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

రుధిరసౌధం 176


సరే నువ్వెళ్ళు .. అని ... శంకరం .. అని గట్టిగా అరిచాడు భూపతి ..

వెంగమ్మ మళ్ళి వంటింటిలోకి వెళ్ళిపోయింది .... గుమస్తా శంకరం లోపలికి వచ్చాడు ..

అయ్యా .. అని కాస్త వంగి చేతులు కట్టుకొని నిలబడ్డాడు గుమస్తా శంకరం ..

బాబు ఉదయం నుండి కనబడలేదు .. నీకేమన్నా చెప్పి వెళ్ళాడా ? అని అడిగాడు భూపతి ...

లేదయ్యా ... ఆ పిల్ల కోసం బయటకి వెళ్ళారేమో ... అన్నాడు గుమస్తా శంకరం  వెటకారం గా ...

అతడి వంక కోపంగా చూసి ... తెలియక పొతే తెలియదని చెప్పు .. అంతే గాని నోటికొచ్చి నట్టు వాగకు .. అని ,

వెళ్ళు ... వెళ్ళు .. వెళ్లి బాలయ్య ని పంపు .. అన్నాడు భూపతి ..

చిన్నబుచ్చుకున్న మొహం తో బాలయ్య ఈరోజు ఇంకా రాలేదు అయ్యా .. అన్నాడు శంకరం ..

రాలేదా ? వాడేప్పుడు ఇంత ఆలస్యం చేయడే ... అనుకొని మళ్ళి తానే రాత్రి నేను చెప్పిన పని ముగించుకు వచ్చే

సరికి ఆలస్యమయిందేమో .. అని మనసులోనే అనుకొని .. సర్లే వచ్చాక నన్ను కలవమని చెప్పు ... అన్నాడు

భూపతి ..

శంకరం వెళ్ళిపోయాక .. రత్నం నాకు చెప్పకుండా ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళుంటాడు ? ఈ పిల్ల నిన్నంతా

కనబడలేదు .. ఏం రాచ కార్యాలు చేస్తుందో ... ? ఆ పిల్ల ఆ యశ్వంత్ వాళ్ళ చుట్టూ తిరుగుతుంది .. వీడేమో

ఆ ధాత్రి చుట్టూ .. ఏంటో .. కానీ వాడు మనసారా అడిగాడు .. ఆ పిల్ల తో పెళ్లి చేయమని .. ఆ పిల్ల ఒప్పుకున్నా

ఒప్పుకోకపోయినా నా కొడుకు పెళ్లి ఆ పిల్లతో జరిపించి తీరతాను .. అవన్నీ సవ్యం గా జరగాలంటే ముందు ఆ

యశ్వంత్ వాళ్ళ అడ్డు తొలగించుకోవాలి ... అనుకొన్నాడు మనసులో కసిగా భూపతి .

                                                 *******************************

యష్ .. వాడికి స్పృహ వచ్చింది .. మాట్లాడదాం పద .. అంటూ వచ్చాడు శివ ..

నాకు ఇప్పుడే వచ్చింది రా స్పృహ .. ఎలా నిద్రపోయానో ఏమో .. అంటూ లేచి మొహం కడుక్కున్నాడు .. యశ్వంత్ .
యశ్వంత్ .. అటు చూడు .. ఆ ముసలోడు ఇటేందుకు వస్తున్నట్టు ? అన్నాడు శివ .. తమవైపు వస్తున్న

సరస్వతి తాత ని చూస్తూ ..

మొహం కర్చీఫ్ తో తుడుచుకుంటూ .. చూద్దాం .. రానీ .. అన్నాడు యశ్వంత్ అతడి వైపు చూస్తూ ..

తాత అలా వీరి వద్దకి వచ్చి ... బాబూ .. మీతో మాట్లాడ దామని వచ్చాను అన్నాడు .

ఏం ? మీ ఊరి వాళ్ళెవరు మాతో మాట్లాడకూడదని నిన్నే మీ ఊరి దేవుడు నిర్ణయించాడు కదా ... మీరూ వంత

పాడారు కదా .. మరి తెల్లారే సరికి మాతో ఏ అవసరం వచ్చింది అన్నాడు కోపం గా  శివ .

శివా .. ఏంటా మాటలు ? అన్నాడు యశ్వంత్ ..

అననీ బాబూ .. ఆ బాబు మాటల్లో తప్పేముంది ? నేను తప్పు చేశాను బాబూ .. తొందర పాటుతో .. ఆ భూపతి

మాటలు నమ్మి మిమ్మల్ని తప్పు పట్టాను .. నన్ను క్షమించండి .. అన్నాడు తాత .

ఇంత సడన్ గా మీకు జ్ఞానోదయం కలగటానికి కారణం ఏంటో ? అన్నాడు వెటకారంగా శివ .

శివా నువ్వు కాస్త ఆగు .. అని ... తాత వైపు తిరిగి ,తాతా .. మీరు పెద్దవాళ్ళు .. మీరు మమ్మల్ని క్షమాపణ అడగ

నవసరం లేదు .. మీ మానసిక స్థితి మేము అర్థం చేసుకోగలం ... కానీ శివ అడిగినట్టు .. మా తప్పులేదని మీకెలా

తెలిసింది ? అన్నాడు యశ్వంత్ .





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 19 June 2014

రుధిరసౌధం 175

హటాత్తుగా మెళకువ వచ్చి కళ్ళు తెరచింది రచన ....

ఓ క్షణం తానేక్కడుంది అర్థం కాలేదు .. అయోమయం గా చుట్టూ చూసింది ... అప్పుడు గుర్తు వచ్చింది ఆమె కి ..

సరస్వతి ఇంట్లో ఉన్నట్టు ... మెల్లిగా లేచి సత్య పడుకున్న వైపు చూసింది .. ఆమె ఇంకా నిద్రలోనే ఉంది ...

సరస్వతి కోసం చుట్టూ చూసింది ...

వెనక నుండి .. ధాత్రమ్మ .. నేనిక్కడున్నా .. లేచారా ? అంది సరస్వతి ...

వెనక్కి తిరిగి .. ఓహ్ .. ఇక్కడున్నావా ? అంది రచన ..

సరస్వతి వంట పనిలో ఉంది ...
     నవ్వుతూ అంది...

.. మీరు కూర్చున్నచోటే అలానే నిద్రపోయారు .. బాగా అలసిపోయారు .. అందుకే మిమ్మల్ని కదిలించ బుద్ధి

కాలేదు . అంది సరస్వతి ..

నిజమే .. సరస్వతి .. నిజంగా అలసి పోయాను ... అని సత్య కేసి చూసింది రచన ...

సత్యమ్మ కి కొంచెం జావ తాగించానమ్మ .. ఒంటి మీద తెలివి లేకున్నా ఆకలి తెలిసిందేమో తాగేసింది ... అంది

సరస్వతి ..

అలానా ? థాంక్స్ సరస్వతీ .. అని నేను మహల్ వరకు వేల్లోస్తాను సరస్వతీ ... యశ్వంత్ వాళ్ళని కలిసి వస్తాను ..

అంది రచన .

తాత ఇప్పుడే పోయిండ మ్మా ... యశ్వంత్ బాబు వాళ్లకి క్షమాపణ చెప్పాలని .. అంతే కాకుండా మీరు , సత్యమ్మ

ఇక్కడే ఉన్నారని .. నాతో పాటు ... ... చెప్పోస్తానన్నాడు .. అంది సరస్వతి .

అవునా ? సరే .. కానీ సరస్వతీ .. నా బట్టలు భూపతి వాళ్ళింట్లో ,మరికొన్ని యశ్వంత్ వాళ్ళ లగేజ్ తో ఉన్నాయి ..

నాకు స్నానం చెయ్యాలని ఉంది .. కానీ బట్టలు లేవే ... ఎలా ? అంది రచన ..

అమ్మా .. నాదగ్గర వోణి ,పరికిణి ఉన్నాయి వేసుకుంటారా ? మా చెల్లి కోసం కొన్నవి .. కొత్తవే .. మీకు అభ్యంతరం

లేకపోతేనే .. అంది సరస్వతి .

భలే దానివి సరస్వతీ .. దానికేముంది గాని .. నాకు వోణి కట్టుకోవటం రాదు .. నువ్వు సాయం చేస్తావా ? అంది

చిరునవ్వుతో రచన ..

తప్పకుండా .. అని ,  రండి .... మీకు స్నానాల గది చూపిస్తాను .. అని కూర్చున్న చోటినుండి లేచింది సరస్వతి ..

సరస్వతి వెంట నడిచింది రచన .

                                          *************************************

వెంగమ్మ .. వెంగమ్మా ... హాల్ లోంచి భూపతి గట్టిగా అరవటం తో పరుగున హాల్ లోకి వచ్చింది వెంగమ్మ  ...

భూపతి ఎదురుగా వగరుస్తూ నిల్చుంది వెంగమ్మ ..

బాబు ఎక్కడికి వెళ్ళాడు ? ఉదయం నుండి కనబడ లేదు .. అన్నాడు ...

తనకి తెలియదన్నట్టు తల ఊపింది వెంగమ్మ ...

కాసేపు ఆలోచించి .. ఆ పిల్ల రాత్రి వచ్చినట్టు లేదు .. అదే ధాత్రి .. అన్నాడు భూపతి ... కల్లెగరేస్తూ

అవునన్నట్లు తల ఊపింది వెంగమ్మ ...

ఇంకా ఉంది 




మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 18 June 2014

రుధిర సౌధం 174

అబ్బా .. వీడు చాలా బరువున్నాడు యశ్వంత్ ... అన్నాడు ఆయాస పడుతూ .. మురారి ..

ఇంకెంత దగ్గర కోచ్చేసాం .. అదుగో మన టెంట్స్ కనబడుతున్నాయి గా .. అన్నాడు శివ ...

శివా .. కాలికి దెబ్బ తగిలించుకొని వీడిని మోసే బాధ తప్పించుకున్నావు నువ్వు ... వీడికి ఓ వారం భోజనం కట్

చేస్తే బరువు తగ్గుతాడెమో .. అన్నాడు యశ్వంత్ కూడా ఆయాస పడుతూ ..

మై డియర్ యశ్వంత్ ... వీడు ఒకరోజు భోజనం చేసేది మనకి వారం కి సరిపోతుంది .. అన్నాడు శివ ...

ఈలోపు టెంట్స్ దగ్గరికి రాగానే ఇద్దరూ ఒక్కసారిగా వాడిని నేల మీద ఎత్తికుదేసారు ...

హే శివా .. ఏంటి వీడు ? అస్సలు స్పృహలోకి రాడు ..  పోయాడా ? అని అడిగాడు యశ్వంత్ ...

లేదు యశ్ .. వీడక్కడ ఏదో చూసి భయపడి స్పృహ కోల్పోయాడు .. మనకి ఇబ్బందవుతుంది దారిలో వీడికి

స్పృహ  వస్తే అని నేనే వీడి నెత్తి మీద ఓ దెబ్బ వేసాను .. మరో గంట దాకా వీడికి స్పృహ రాదు .. అన్నాడు శివ .

ముందు వీడిని ఎక్కడ ఉంచుదాం యశ్వంత్ ? అని అడిగాడు మురారి ...

హా ... అని కాస్త ఆలోచించి .. మహల్లో .. అక్కడే సేఫ్ .. ఎవ్వరూ రారూ .. వీడు తిన్నగా ఉంటాడు .. అన్నాడు

యశ్వంత్ .

గుడ్ ఐడియా ... వెనుకాల స్తంభానికి కట్టిపడేద్దాం వెధవని ........... అన్నాడు మురారి ..

ఉండు మురారి .. ఇప్పటి వరకూ వీడిని మోసామా ? మల్లి వాడ్ని అక్కడికి తీసుకెళ్ళాలంటే నా వల్ల కాదు అన్నాడు

యశ్వంత్ .

సర్లే యశ్ .. నువ్వు రిలాక్స్ అవ్వు .. నేను , మురారి వెళ్లి వీడి పని చూసుకొని వస్తాం .. అన్నాడు శివ ..

ఓకే .. అన్నాడు యశ్వంత్ ..

కింద పడున్న బాలయ్య ని మళ్ళి అతి కష్టం గా భుజం మీద వేసుకొని మహల్ కేసి నడిచాడు మురారి ... టెంట్ లో

ఉన్న తాడు తీసుకొని మురారి వెంట నడిచాడు శివ .

వాళ్లటు వెళ్ళగానే ... రచన కనబడనే లేదు .. ఏమయ్యుంటుంది ? నా మనసు చెబుతుంది తను క్షేమం గానే

ఉందని .. కానీ కళ్ళారా తనని చూస్తె తప్ప మనస్సాంతి ఉండేలా లేదు ... కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి ..

కాసేపు రెస్ట్ తీసుకోక తప్పేట్టు లేదు .. అని టెంట్ లో చేరబడ్డాడు యశ్వంత్ ...

పౌర్ణమి మరో రెండు రోజుల్లో ఉంది .. రచన ఊరు చేరుకోవాలి .. గుడి లో దీపాలు పెట్టాలి .. సత్యా క్షేమం గా ఉండాలి .

ఇవన్ని సక్రమం గా జరిగితీరాలి .. ముందు సరస్వతి విషయం కూడా ఊరందరి ముందు బాలయ్య నోటితోనే

చెప్పించాలి .. ఆ వెధవ తో ఎలాగన్నా చెప్పించాలి .. అయినా ఉన్నట్టుండి సరస్వతి ఎలా మాయమైంది ?

ఆలోచనల తోనే అతని కళ్ళు మెల్లిగా మూతలు పడ్డాయి ..

ఇంకా ఉంది


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది


Tuesday, 17 June 2014

రుధిర సౌధం 173


తాత వెనుకాలే నడిచి వెళ్ళింది రచన .

అతడు ఆ పాత పెట్టెని తెరచి అందులో అడుగున ఉన్న ఓ తాళ పత్ర గ్రంథాన్ని తీసాడు ... అది తెరచినప్పుడు అతని

కళ్ళలో చెమ్మ కనిపించింది .

అదేంటి తాతా ? అని అడిగింది రచన ఆ తాళపత్ర గ్రంథాన్ని చూస్తూ ..

ఇది మా పూర్వీకుల నుండి నాకు సంక్రమించిన ఆస్తి .. మా పూర్వీకులు గొప్ప శిల్పకారులు .. అప్పటి వారి

నైపుణ్యం ముందు .. ఇప్పటి మీ చదువులు .. కట్టే కట్టడాలు నిలబడవు తల్లీ .. అన్నాడు తాత మీసం మెలేస్తూ ..

రచన చిన్నగా నవ్వి .. నిజమే తాతా .. పురాతన భారతీయులు చాల తెలివైన వాళ్ళు .. ఇప్పటి తరం కంటే వేల

రెట్లు .. అంది చిరునవ్వుతో .

రాచబిడ్డవైనా అహంకారం లేదు తల్లీ నీలో .. ఇదిగో ఈ తాళ పత్రగ్రంధం లో శిల్ప నైపుణ్య రహస్యాలు .. కట్టడాల

వివరాలు ఉన్నాయి .. ఇందులో వైష్ణవీ దేవి గుడి గురించి కూడా ఉండొచ్చు .. అన్నాడు తాత.

ఓహ్ .. నిజమే తాతా .. ఆ గుడి కట్టింది మీ పూర్వీకులే కనుక అన్ని రహస్యాలు ఇందులో ఉండొచ్చు .. అన్నది

రచన  ..

అవునమ్మా .. కానీ ఈ తాళపత్ర గ్రంథం నువ్వు చదవగలవా ? నాకైతే కళ్ళు కనబడవు .. చదువూ రాదు ,,

అన్నాడు తాత .

రచన అతడి చేతిలోని గ్రంథాన్ని తీసుకొని చూసింది .. సంస్కృతం లో రాసి ఉంది .. అక్కడ అక్కడ కొన్ని దేవతా

మూర్తుల బొమ్మలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి ..

తాతా .. ఈ గ్రంథం సంస్కృతం లో ఉంది .. నాకిది ఉపయోగపడుతుంది .. నా పని అవ్వగానే దీన్ని తిరిగి మీకు

అప్పగిస్తాను .. అంది రచన .

అలాగేనమ్మా .. నేను మీ వాళ్లకి చేసిన అన్నాయానికి ఇదే పాయస్చిత్తం అనుకొంటా తల్లీ ... అన్నాడు తాత .

తాతా .. ఇది మీ వంశ సంపద అన్నావు .. తప్పని సరిగా ఇది మీకు అంద చేస్తాను .. అంది రచన .

అలాగేనమ్మ .. అన్నాడు తాత .

ఈలోపు వేడి నీళ్ళతో వచ్చింది సరస్వతి ... మీరలా కూర్చోండి .. నేను మీ కాళ్ళని వేడి నీళ్ళతో వత్తుతాను అంది

సరస్వతి .

వద్దు సరస్వతి నేనే చేసుకుంటాను అంది మొహమాటంగా రచన .

నన్ను చే యనీయ్యండి ధాత్రమ్మా .. అంది సరస్వతి ..

ఇబ్బందిగానే కూర్చుంది రచన ... ఓ గుడ్డ ని నీటిలో ముంచి రచన కాళ్ళని వోత్తసాగింది సరస్వతి ..

నడచి నడచి పుండ్లు పడ్డ పాదాలకి సాంత్వన లభించినట్లయింది రచన కి ... అలాగే మెల్లిగా వెనక్కి చేరబడి కళ్ళు

మూసుకొంది రచన .

ఇంకా ఉంది





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 16 June 2014

రుధిర సౌధం 172



లేదు సరస్వతీ .. యశ్వంత్ వాళ్ళ పరిస్థితి తెలిసాక నేనిక్కడ ప్రశాంతం గా ఉండలేను .. నేను మహల్ దగ్గరికి వెళ్లి

వస్తాను .. అంది రచన ముందుకి నడవబోతు ..

ఆమె చేతిని పట్టుకొని ఆపి .. అమ్మా .. మీరు నా మాట వినండి . మరి కాసేపట్లో తెల్లారిపోతుంది . చాలా దూరం

నుండి నడిచి వచ్చారు . మీ పాదాలు ఎంతలా వాచిపోయాయో గ్రహించే స్థితి లో మీరు లేరు . మరో వైపు సత్యమ్మ

.. ఆమె ని చూస్తుంటేనే జాలి వేస్తోంది . దయచేసి నా మాట వినండి . తెల్లారే సరికి భూపతి భాగోతం నేనే బయట

పెడతాను . ఇక యశ్వంత్ బాబు వాళ్ళ తప్పే0 లేదని ఊరి జనానికి ఈ సంఘటన వల్లనైనా అర్థం అవుతుంది ..

అంతే కాక భూపతి చేసిన అన్యాయం కూడా ... చూస్తుంటే ఇదంతా మా మంచికే అనిపిస్తోందమ్మ .. అంది సరస్వతి .

రచన చిన్నగా తలూపింది ...

అంతే కాదు .. మళ్ళి ఆ భూపతి మనుషులు వస్తెనొ... మీ దగ్గర గన్ ఉంది .. అది ధైర్యం కదమ్మా .. అంది

అమాయకం గా సరస్వతి .

రచన చిన్నగా నవ్వి .. నేను తెల్లారే వరకు ఎదురుచూస్తాను సరస్వతి .. అంది రచన .

మా మంచి దాత్రమ్మ .. నేను మీకోసం వేడి నీళ్ళు .. సత్యమ్మ కోసం కూడా ఏమైనా చేసి తీసుకొస్తా .. అని

హడావుడి గా పరుగుతీసి .. పొయ్యి మీద కుండలు పెట్టి వంట కి సంసిద్ధమయింది సరస్వతి .

ఆమె నలాగే చూస్తున్న రచన ని చూసి " ఇది వెర్రిబాగులదొ లేక తెలివైందో అర్థం కాదమ్మా "  అన్నాడు తాత .

అతని వైపు చూసి ఓ చిరునవ్వు నవ్వి .. తాతా .. మహల్లో గుడి ని నిర్మించింది మీ వంసీకులే నటగా .. అని

అడిగింది .

అతడామె కేసి అయోమయం గా చూసి .. సరస్వతి కేసి కోపంగా చూశాడు ..

తాతా .. నేను వర్ధన్ వర్మ కూతురిని .. నేనా విషయం కోసం తెలుసుకోవోచ్చుగా .. అంది రచన అతని మనసులో

సందేహాన్ని చదివినట్టుగా ...

ఏంటీ ... నేను విన్నది నిజమా ? నువ్వు ... నువ్వు .. వర్ధన్ వర్మ కూతురివా .. అన్నాడు తాత నమ్మలేనట్టుగా .

అవును తాతా .. నేను వర్ధన్ వర్మ , గిరిజా దేవి ల బిడ్డని .. ఆ రాణి మహల్ వారసురాలిని .. ఆస్తి ని సొంతం

చేసుకోడానికి కాదు .. బాధ్యత ని నెరవేర్చుకోడానికి వచ్చాను . గుడి తలుపులు తెరవాలి .. గుడిలో దీపాలు

పెట్టాలి .. గుడి ని కట్టినది  మీ వంసీకులే కాబట్టి ఆ గుడి రహస్యం మీకే తెలియాలి తాతా .. అంది రచన .

గుడి ఎక్కడుందో నాకు తెలీదు .. మహల్ కి దక్షిణ దిశ  లో  ఉందని మాత్రం తెలుసు .. కానీ మహల్ పిశాచాలకి

ఆలవాలమైనాక గుళ్ళో అమ్మవారు సైతం ఊరు దాటి వెళ్ళిపోయిందని .. అందుకే ఈ ఊరికి ఈ దుస్థితి అని మా

నాన్న చెబుతుండే వాడు .. అన్నడు తాత .

తాతా .. గుడి ఎక్కడుందో నేను తెలుసుకున్నాను .. వెళ్ళాను కూడా .. కానీ గర్భగుడి ద్వారం తెరవటం ఎలాగో

అర్థం కాలేదు .. అంది రచన .

గుడిని కనిపెట్టావా నువ్వు ? అయితే తప్పక కారణ జన్మురాలివే నువ్వు .. ఆ గుడి ద్వారం కొన్ని ఘడియల్లో

మాత్రమె తెరవాలి ... అని ... ఆ గదిలో ఒక మూలగా ఉన్న పాత కర్ర పెట్టె ని చూసి ... ఒక్కసారి .. ఇలా రామ్మా

అని ఆ పెట్టె వైపు నడిచాడు తాత .

ఇంకా ఉంది  





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 13 June 2014

ఎదురుచూపు ముగిసింది

ఎదురుచూస్తూనే కరిగిపోయే కాలం ..

ఎదురుపడగానే చెదిరిపోయే విరహం ..

గతము గతము తో పెనవేసి స్వాగతం చెప్పా భవితకి ..

అభిమతాన్ని ముందుంచి సమ్మతo  తెలిపా మనసుకి ..

గుండె లోన గుప్పుమన్న వలపు పరిమళమా ...

గొంతు దాటి పైకి రాని పలుకు నాపిన మౌనమా ...

కనులు కనులతో మాటలాడే వైనపు తరుణమా ..

కళలు నేర్పే కలలు పండే కమ్మని సమయమా ..

బాధ కింకా సెలవని పెదవి పై చిరునవ్వు రానీ ..

మండుటెండల వేసవిలోనే ఆమని రాకని తెలపనీ ..

ఈ దూరం .. దూరం కాగా .. మనసు తాకెను అంబరం ..

సింధూరం నుదుట మెరవగ .. తరుణి కిప్పుడు సంబరం ..

గాజుల గలగల నవ్వుల కిలకిల మల్లెల ముడుపుల సంతకం ..

వెన్నెల వెలుగుల ఆశల మణుగుల తీయని ఊహల సంతసం ..

ఇది కాదా .. అచ్చతెలుగు మగువ హృదయపు సహవాసం ..







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

రుధిర సౌధం 171






అతడు సరస్వతి వైపు అయోమయం గా చూసి .. రచన వైపు చూశాడు .

రచన అతడి వైపు నిర్లిప్తంగా చూసింది ..

మళ్ళి సరస్వతి వైపు చూసి .. ఏమంటున్నవే ? నువ్వు వీళ్ళతో పోయినావు ? మనిషి వి జాడ లేకుండా పోయినవ్ .

వీల్లననక మరెవరిని అనమంటావు? అన్నాడు అతడు .

తాతా .. నీ మనవరాలిని  భూపతి మాయం చేసాడు .. మేము కాదు . మాకంత అవసరం ఏముంది తాతా ? మీకు

వీలైనంత సహాయం చేయాలని చూసాం గానీ హాని తలపెట్టే వాళ్ళలా నీకని పించామా ? అంది రచన వారి

ముందుకి నడచి .

భూపతా ? అన్నాడతను అయోమయం గా .

అవును తాతా .. వాళ్ళే రాముడ్ని కూడా చంపినారు . నిజం తెలిసిపోనాది తాతా .. అమ్మోరి గుడి దారి కావాలి

వాళ్లకి .. యశ్వంత్ బాబు వాళ్ళని ఊరి నుండి పంపేయాలి .. అందుకే ఇదంతా జరిగినాది .. ఆడు మన బతుకుల్లో

ఆరని మంటలే రేపుతున్నాడు తాతా .. అంది సరస్వతి ఏడుస్తూ ..

ఎంత పనై పోయినాది నావల్ల తప్పే జరిగి పోనాదమ్మ .. ఇషయం తెలీక భూపతి రెచ్చగొడితే యశ్వంత్ బాబు వాళ్ళ

మీదకి గొడవకి పోనాం ..భూపతి వార్ని ఊరు నుండి వెళ్ళ గొట్టిండు .. ఇల్లు కూడా ఖాళీ చేపించిండు .. అన్నాడు

తాత .

అవునా ? ఇదంతా ఎప్పుడు జరిగింది ? భూపతి ఇంత పని జేసాడా ?కోపం తో అడిగింది రచన .

అంటే వాడనుకున్నది సాధించినాడు అన్నమాట .. అంది సరస్వతి పళ్ళు కొరుకుతూ ..

మరి యశ్వంత్ వాళ్ళు ఎక్కడికి వెళ్లారు ? ఆందోళన గా అడిగింది రచన .

ఆ మహల్ కాడికి పోతామన్నారు .. పాపం సరస్వతి ని వాలు వెదకటానికి పొతే నేను ఊరినుంచి పంపించేసినా ..

అన్నాడు తాత పశ్చాత్తాపం తో ..

ఇదంతా భూపతి ఆడించిన నాటకం .. నువ్వు మాత్రం ఏం చేస్తావు తాతా ? వాడు చేసిన పాపాలు అన్నింటికీ వాడు

శిక్ష తప్పక అనుభవిస్తాడు .. పైన భగవంతుడు ఉంటాడు కదా .. అంది రచన .

వాడంటే పాపిష్టి వాడు .. నా బుద్దేమయింది ? మనవరాలు కానారాక బుర్ర మందగించింది .. తల్లీ .. అని సత్య వైపు

చూసి,   ఇంతకీ ఈ పిల్ల కి ఏమైనది ? అన్నాడు తాత .

తాతా .. అవన్నీ తర్వాత చెప్తాం .. ముందు మాకు ఆకలవుతాంది .. ఏదన్నా వండిపెడతా .. నువ్వు కూడా

ఎప్పుడు   తిన్నవో ఏమో .. అంది సరస్వతి .

నాకేం వద్దు సరస్వతీ .. ఆకలిగా లేదు అంది రచన .

మీ మొహమే చెబుతుందందమ్మ ఆకలి ఉందొ లేదో .. సత్యమ్మ కి ఏవైనా పెట్టాలి కదా ... కాదనకండి .. మీ మనసు

చిన్నబుచ్చుకోకండి .. అంది సరస్వతి .

ఇంకా ఉంది







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 12 June 2014

నివాళి ..


విహారమంటూ  సుదూర మేగిన పసి హృదయాలకి నివాళి ..

కలలను కంటూ కథలను చెబుతూ సాగిన యాత్ర ది ఏ దారి

కన్నవారి కి కడుపు కోత ని కలిగించిన రాక్షస ప్రవాహి ..

కిలకిల నవ్వులనే తనలో  కలిపేసిన వికృత  బియాస్ నది ..

వినోదమంతా విషాదమై శాసించిన కాల విశూచి ...

భవిత కి వేసిన బంగరు బాటని కాల రాసిన దే విధి ..

కట్టలు తెగిన నదీమ తల్లి కర్కశ మారణ కేళి ...

స్నేహం లో నే చివరి ఘడియలు  ముగిసిన లేత  ప్రాయాలకి

కలత చెందిన మనసు తో పలుకు తున్న తుది నివాళి ..







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

రుధిర సౌధం 170


గభాలున ముందుకి వంగి సత్య ని పట్టుకున్నారు ఇద్దరూ ..

సత్యా .. సత్యా .. అని కంగారుగా పిలిచింది రచన . ...

తెలివి లేదమ్మా ... ముందు ఇంటికి తీసుకుపోదాం అంది సరస్వతి ..

సత్య వైపు బాధగా చూసి .. అవును .. స్పృహ లో లేదు .. పద సరస్వతీ .. ముందు సత్య ని మురారి కి అప్ప

గించాలి .. ఇచ్చిన మాట నిలబెట్టు కోవాలి .. అంది రచన బాధగా .

ఆమె అలా ఎందుకు అన్నాదో అర్థం కాకున్నా మారు మాటాడ కుండా ముందుకి నడిచింది సరస్వతి ...

కాసేపట్లోనే వారు ఇంటి ముందు ఉన్నారు ..

సరస్వతీ నేను సత్య ని పట్టుకుంటాను .. నువ్వెళ్ళి తలుపు కొట్టు .. అంది రచన .

మెల్లిగా సత్యని వదలి ఇంటి తలుపు కొట్టింది సరస్వతి ... ఎవ్వరూ తలుపు తీయక పోయేసరికి ఘడియ కేసి

చూసింది .. దానికి తాళం వేసుంది ..

అయ్యో .. మురారి బాబు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు ? ఇంటికి తాళం వేసుందే .. అనుకొంది మనసులో ...

ఏమైంది సరస్వతీ ? అందరూ నిద్రలో ఉన్నారేమో తలుపు గట్టిగా కొట్టు .. అని అందే గానీ .. "ఈ పరిస్థితులలో

నిశ్చింత గా నిద్రపోరే " అనుకొంది మనసులో రచన .

ధాత్రమ్మా .. ఇంటికి తాళం వేసుంది .. అంది సరస్వతి వీరి దగ్గరికి వచ్చి సత్య ని పట్టుకోవడం లో సాయం చేస్తూ ..

అవునా ? మరైతే ఇప్పుడెం చేద్దాం ? అంది రచన కంగారుగా ..

ఈ పక్కనే మా ఇల్లు కదమ్మా .. మా ఇంటికి తీసుకెళ్దాం .. అంది సరస్వతి ..

చిన్నగా తలూపి .. ముందుకి నడుస్తూ ఒక్కసారి వెనక్కి చూసింది రచన .. ఇంటి ముందు వెహికల్ కూడా కనబడ

లేదు ఆమె కి .. "వీళ్ళు వెహికల్ తీసుకొని ఎక్కడికి వేల్లుంటారు ? లేదంటే సరస్వతి ని వెదుకుతూ పట్నం లోనే

ఉండిపోయార ? అయినా ఇవన్ని తరువాత ఆలోచించొచ్చు .. ముందు సత్య కోసమే ఆలోచించాలి "అనుకుంది

ఆమె.

ఇద్దరూ .. సరస్వతి ఇంటి ముందుకి వెళ్లి తలుపు కొట్టారు .. కాసేపు తరవాత సరస్వతి తాత తలుపు తీసాడు ..

ఎదురుగా సరస్వతి ని చూస్తూనే ... సరస్వతీ నువ్వా ? అన్నాడు ఆశ్చర్యం గా ..

హా .. తాతా ..  అంది సరస్వతి కళ్ళ నీళ్ళ పర్యన్తమవుతూ ..

నీకేం కాలేదుగా .. క్షేమం గా ఉన్నావు గా .. అన్నాడు అతడు ఆప్యాయం గా .

నేను బాగానే ఉన్నాను తాతా .. ముందు మమ్మల్ని ఇంట్లోకి రానీ .. గుమ్మం దగ్గరే అన్ని మాటాడతవ ? అంది

సరస్వతి ..

గుమ్మానికి అడ్డు తప్పుకున్నాడు అతను .. ఇద్దరూ కలసి సత్య ని లోపలికి తీసుకొచ్చారు ..

అతడు గుమ్మం తలుపు వేసి .. ఏమయ్యావే .. మళ్ళి ఈ పట్నం వాళ్ళతో ఎందుకు తిరుగుతుండావు ? అన్నాడు

అసహనం గా .

సత్య ని జాగ్రత్త గా మంచం మీద పరుండ బెట్టి .. రచన కేసి చూసి ఓ నిట్టూర్పు విడిచి .. తాత వైపు చూసి .. మెల్లిగా

నడచి కొవ్వొత్తి  వెలిగించి  అతని దగ్గరకి వెళ్లి .. తాత .. నువ్విప్పుడు ఈ మనవరాలిని కళ్ళారా చూస్తున్నవంటే .. ఈ

పట్నం వాళ్ళ వల్లే .మరి ఆల్లనే తిడతావా ? అంది సరస్వతి .




ఇంకా ఉంది












మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 11 June 2014

రుధిర సౌధం 169

ఇంత జరిగితే నువ్వు మాతో ఒక్క మాటన్నా చెప్పాల్సింది సరస్వతి .. నీకు మేము సహాయం చేసేవాళ్ళం కదా ..

అంది ఆమె వైపు బాధగా చూస్తూ .. రచన .

నా బిడ్డ వాళ్ళ కాడ ఉన్నాడు .. ఏమని చెప్పగలను ? పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళ కాడికి ఎల్తే నా బిడ్డ ని నాకిచ్చి ..

నట్టే ఇచ్చి నన్ను బంధించారు .. మా తాత ని కూడా చంపుతా మంటున్నారు .. అంది సరస్వతి .

నువ్వు భయపడకు సరస్వతీ .. నీకు తోడుగా మేమున్నాం కదా .. కానీ నిన్ను బంధించటం వెనుక భూపతి

ఉద్దేశ్యం ఏమైయుంటుంది ?   అంది సాలోచన గా రచన .

ఒకటి .. మీ అందరిని సమస్యల్లో పడేసి ఈ ఊరినుండి పంపెయటానికి .. ఇంకో విషయం ఏమిటంటే వాళ్ళ మాటల్లో

నాకు అర్థమైంది .. మహల్లో గుడి ఉంది .. అమ్మోరి గుడి .. ఆ అమ్మోరి మెడలోని హారం చాలా మహత్తు గలది ..

వీళ్ళకి ఆ హారం కావలి .. అందుకే నన్ను బంధించారు అంది సరస్వతి ..


విస్తుపోతూ .. నిజమా ? అంటే భూపతి కి కూడా గుడి గురించి తెలుసు .. అంది రచన .

అవును .. ఈ విషయం మీకు తెలుసా ? అంది సరస్వతి ..

ముందు నువ్వు  వివరం గా చెప్పు .. సరస్వతీ .. అంది రచన .

ఆ మహల్లో గుడి ఉన్నమాట నిజమే నమ్మా .. కానీ అక్కడికి ఎలా వెళ్ళాలో మాత్రం ఎవ్వరికి అంతుపట్టడం లేదు ..

పూర్వం మా వంసీకులే ఆ గుడి కట్టినారట .. తరతరాలుగా నైనా ఆ రహస్యం మాకు తెలుసుండాలి అని భూపతి

నమ్మకం .. అదీ కొంత నిజమే .. మా రాముడికి తెలుసు .. చెప్పమని బలవంత పెట్టి ఆఖరికి పేనాలే తీసేసినారు ..

మా తాత ని కూడా వేధిస్తున్నారని తాత చెప్పిండొ కసారి .. ఇప్పుడు నాకు తెలిసునేమోనని నన్ను బంధిoచారు .

అంది సరస్వతి .

ఓహ్ .. అంది సాలోచన గా రచన .

ఆ గుడి గురించి రాచ కుటుంబీకులకి , మా కుటుంబానికి మాత్రమె తెలుసు .. కానీ నిజంగా నాకైతే ఆ గుడి

గురించి  ఏం తెలవదమ్మ .. అంది సరస్వతి .

ఓహ్ .. ఇప్పుడర్థమైంది .. వీరస్వామి నానుంచి ఆసిస్తున్నదేంటో .. అనుకొంది మనసులో రచన .

ఏమిటమ్మ ? నా మాట నమ్మశక్యం గా లేదా ? అంది సరస్వతి ఆందోళన గా ..

అదేం లేదు .. నువ్వు నీ బిడ్డ గురించి .. తాత గురించి భయపడకు .. వాళ్ళ ఆట నేను కట్టిస్తాను .. అంది రచన .

అమ్మా .. మీరు రాచ బిడ్డే కదూ .. ఇప్పటికైనా చెప్పండి .. అంది సరస్వతి

ఆమె మెల్లిగా తల ఊపి .. ఈ విషయం బయట ఎక్కడా తెలియకూడదు సరస్వతీ .. అంది రచన .

మీ కుటుంబానికి మా  కుటుంబం తరతరాలుగా విశ్వాసం గా ఉందమ్మా .. ఇప్పటికి ఆ అవకాశం నాకొచ్చింది ..

ఎలా వదులుకున్తానమ్మ ? అంది సరస్వతి ..

ఇంతలో సత్య దేహం కింద పడుతున్నట్లని పించేసరికి .. కంగారుగా .. సరస్వతీ పట్టుకో సత్యని .. మనం ఊరి

పోలిమేరలకి వచ్చేసాం .. అంది రచన .

ఇంకా ఉంది






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday, 10 June 2014

రుధిర సౌధం 168



అడవి మార్గం గుండా వడివడిగా నడుస్తున్నారు రచన , సరస్వతి .. వారి ముందు గాలిలో తేలుతూ వస్తోంది సత్య ..

ఆమె పూర్తిగా అచేతనావస్థ లో ఉంది .. స్పృహ కూడా లేదు .. వడలిపోయిన మొహం జాలి గొలుపుతుంది ..

అమ్మా .. దాత్రమ్మ .. సత్యమ్మ ని ఇలా చూడటం బాధగా ఉంది .. అంది సరస్వతి ముందుకి నడు స్తూనే ..

అవును సరస్వతి .. ఇలాంటి అనుభవాలని ఎదుర్కొంటానని నేను అనుకోలేదు .. సత్య కూడా అనుకోని ఉండదు ..

అంది రచన ,సత్య నే తదేకం గా చూస్తూనే ..

మీరు రాచ బిడ్డా ? సంకోచం గా అడిగింది సరస్వతి ..

ఆ వీరస్వామి మాటలు మనసులో పెట్టుకొనే అడుగుతున్నావా ? నేనేదన్నా చెప్పే ముందర .. నిన్ను ఓ విషయం

అడగాలి సరస్వతీ .. నువ్వు మాతో అబద్ధం ఎందుకు చెప్పావు ? మేము నిన్ను నమ్మాం .. కానీ నువ్వు మమ్మల్ని

మోసం చేశావు .. అంది తీక్షణం గా రచన ..

రచన మాటలకి టక్కున ఆగింది సరస్వతి .. ఆగి ఏదో చెప్పాలనుకునే లోగా రచనే అంది ..

ఏం చెప్పాలన్నా నడుస్తూనే చెప్పు .. మరోసారి సత్య సమస్యల్లో పడకూడదు .. అంది నడుస్తూనే ..

మళ్ళి రచన తో పాటు నడుస్తూ .. ధాత్రమ్మా .. నేను మిమ్మల్ని మోసం ఎలా చేస్తాను ? నాకోసం మీరు ఎంత

చేశారు ? అలాంటి మీ దగ్గర నాటకాలు ఆడుతానా ? అంది బేల గా ..

మరైతే నువ్వు సడన్ గా ఎందుకు మాయం అయ్యావు సరస్వతి ? భర్త చనిపోయిన స్త్రీ పది రోజులు కాక ముందే

ఎవ్వరి ఇంటికి వెళ్లరాదని నియమం ఉంది కదా మీకు .. కానీ మాతో బంధువుల ఇంటికి వెళ్ళాలని ఎందుకు

చెప్పావ్ ? ఆవేశం తో రచన గొంతు వణికింది ..

మీకీ కోపం రావటం న్యాయమే నమ్మా .. కానీ నేను ఈ ఊరి కట్టుబాట్లని ఎప్పుడో దాటేసాను .. ఈ ఊరికి ఇంకో కట్టు

బాటు ఉంది .. ఈ ఊరిలో ఏ ఒక్కరు చదువుకోకూడదని .. ఆ కట్టుబాటు పెట్టింది భూపతి .. ఏ పిల్లా జెల్లా చదువు

కాకుంటే ఈ ఊరిలో భూపతి ఎప్పటికి పెత్తనం వెలగబెడతాడు .. మా జీవితాల్ని శాసిస్తాడు .. నాకూ మా రాముడికి

పుట్టిన బిడ్డ ఉన్నాడు .. కానీ ఈ ఊరి ద్రుష్టి లో నా బిడ్డ జబ్బొచ్చి చనిపోయిండు .. అలా ఏ తల్లి భరించలేదు .. కానీ

నేను భరించినా .. నా బిడ్డ ని నా పిన్ని కూతురి కాడ విడిచిపెట్టి కడుపు కోత అనుభవిస్తున్నా .. ఆడి భవిష్యత్

కోసం  .. కళ్ళ నీళ్ళతో చెబుతుంది సరస్వతి ..

అవునా ? అంది ఆశ్చర్యం గా రచన .

అవునమ్మ .. ఓ తల్లి గా నాకిది బాదే .. కానీ ప్రతి తల్లి ఇట్టాగే ఆలోచిస్తే దేశం ఎలా బాగుపడద్ది ? నా ఊరు బాగు

కోసం నా బిడ్డ ని చదివించాలని అనుకున్నా .. నా చెల్లెలు చదువుకున్నది .. నా మాట .. నా కోరిక నా బిడ్డ ని

నూరిపొయ్య మని చెప్పినా .. అప్పుడప్పుడు రహస్యం గా వెళ్లి చూసొస్తా .. ఏవరికి తెలియకుండా .. కానీ ఎలా

తెలుసుకున్న్నాడో ఏమో ఆ భూపతి .. నేను నా చెల్లి కాడికి పోయేప్పుడు రహస్యం గా నా వెనకాల వచ్చి నా బిడ్డ

జాడ తెలుసు కున్నారు .. పోలీస్ స్టేషన్ లో భూపతి మీద అనుమానం లేదని చెప్పి వారు చెప్పిన చోటికి

రమ్మన్నారు .. నా బిడ్డ ని కాపాడు కుందుకు వాళ్ళు చెప్పినట్టే చేసినా అమ్మా .. వాల్లయ్య చచ్చి పోయిన .. నా బిడ్డ

లో బతికున్నాడు అందుకే .. అంది వెక్కిల్లతో సరస్వతి ..


ఇంకా ఉంది 






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 9 June 2014

రుధిర సౌధం 167


మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ కోట లోనికి ప్రవేశించారు ..

సూది పడితే వినబడేంత నిశ్శబ్దం లో వాళ్ళ అడుగుల కింద నలుగుతూన్న ఎండుటాకుల సవ్వడి తప్ప మరేం

వినబడటం లేదు ..

మొత్తం కోట అంతా కలియ తిరిగారు ..

యశ్వంత్ .. ఆశ్చర్యంగా ఉంది .. ఆ వీరస్స్వామి  వాళ్ళు లేరు ... రచన , సత్య కూడా కనబడటం లేదు .. అన్నాడు

శివ ...

అవును శివా .. అని కాళ్ళ కేదో తగిలి నట్టు అనిపిస్తే .. కిందకి చూసాడు యశ్వంత్ ..

కింద కొన్ని నిమ్మ కాయలు .. ముగ్గు కనిపించే సరికి .. ఇది చూడండి .. ఇక్కడేదో తతంగం అయితే జరిగింది ..

అన్నాడు యశ్వంత్ .

అవును యశ్ .. ఇదంతా చూస్తుంటే .. వీరస్వామి ఇక్కడేదో పూజ చేసినట్టు ఉన్నాడు .. బట్ .. వాళ్ళు వేల్లిపోయారా

ఇక్కడ్నించి ? సరస్వతి కూడా లేదంటే ఇక్కడ బంధించలేదు .. వాళ్లకి అనుమానం వచ్చిందేమో .. మనం  వాళ్ళని

అనుసరిస్తున్నామని .. అన్నాడు మురారి .

నాకు ఊహ కి అందడం లేదు .. ఇటు రచన , సత్య కనబడక అటు వాళ్ళు కనబడక పోవటం వెనుక కారణం ఏమై

ఉంటుందో ... అన్నాడు యశ్వంత్ .

ఇంతలో ఎవ్వరిదో మూలుగు వినబడింది ..

యశ్వంత్ .. అక్కడ ఎవరో ఉన్నారు .. అని మూలుగు వినిపించిన వైపు టార్చ్ వేసాడు శివ ..

అక్కడెవరో కింద పడున్నారు యశ్వంత్ .. పదండి చూద్దాం .. అని అటువైపు కదిలాడు మురారి ..

కింద పడున్న వ్యక్తి దగ్గరకి వెళ్లి బోర్లా పడున్న అతడిని పక్కకి తిప్పాడు యశ్వంత్ ...

ఆర్ని .... వీడు బాలయ్య .. అన్నాడు శివ .. ఆ వ్యక్తి మొహం చూడగానే ...

వీడెందుకు ఇలా పడున్నాడో ... ఒంటి మీద తెలివి లేదు వెధవ కి .. అన్నాడు మురారి ...

ఏదో జరిగింది మురారీ ... ఏం జరిగిందనేది మనకి వీడే చెప్పాలి .. ముందు వీడ్ని మన కస్టడీ లో ఉంచాలి .. ఇక్కడ

ఏం జరిగిందో తెలియటానికి ... అంతే కాకుండా వీడ్ని నాలుగు తన్నైనా సరే .. సరస్వతి విషయం లో నిజం

చెప్పించాలి .. అన్నాడు యశ్వంత్ ..

అది సరే గానీ .. యశ్వంత్ .. వీడ్నేలా తీసుకుపోతాం ? వీడిని చూసావా పంది లా ఉన్నాడు .. అన్నాడు శివ ..

నువ్వేం కంగారు పడకు శివా .. నీకు కాలికి దెబ్బ తగిలింది గా .. ఇంకా నాకు మురారి కి తప్పదు అన్నాడు యష్

నవ్వుతూ ..

ఫర్లేదు యశ్ .. ముగ్గురం మోసుకుపోదాం .. మరి మనోల్ల సంగతి ? అన్నాడు శివ .

రచన ,,,సత్య ని తీసుకునే వెల్లుంటుందని నా అనుమానం .. మనకి విధాత్రి కూడా అదే చెప్పింది గా తను

సాధించుకు రాగలదని ... అన్నాడు యశ్వంత్ ..

అవును ... మనం కూడా ఇక్కడి నుంచి పోదాం త్వరగా .. వీడ్ని  పట్టుకోండి .. అన్నాడు మురారి బాలయ్య ని

లేవనెత్తుతూ  ...


ఇంకా ఉంది




మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

ప్రేమ ఎపుడు కొత్త కావ్యమే ...


నా మది లోనా .. ఓ విరివానా .. కురిసిందే నీ వలనా ..

నీ వలలోనా .. పడ్డానే మైనా .. ఓడించావేమైనా ...

కన్నులలో కలవో నువ్వు .. కలవో నా కన్నులకి

వెన్నెలలో విహరిస్తావు... వన్నెలనే చిలికేస్తావు ..

ఆకాశం అంచుల నుంచి తుంటరిగా చూస్తావు ..

సంతోషపు సంచులు తెచ్చి  కానుకలే ఇస్తావు ..

మల్లెల తో పరుపులు వేసి సౌగంధం అవుతావు ..

నడిరాతిరి నైనా వదలక తలపుల్లో ఉంటావు ..

తేనె పలుకు ముత్యాలు చిమ్మగా .. వాన జాణ మరులు గొలపగా

నా చెంత న నువ్వుంటే నీ మాటలు వింటుంటే ఈలోకం అంటూ ఒక్కటి

ఉందని నే మరిచానే ..

నీ చింత లో నేను ఉండగా పులకింతలు రేపేటట్టుగా  ఆ స్వర్గం

నీరూపం లో నడచి వచ్చెనే ...

నెచ్చలి ఈ తొలకరి జల్లుల తడసినదీ నా మది ..

నా మది పై పరుగులు తీయకే .. అడుగు వెయ్యి నెమ్మది ..

ఝుమ్మని తుమ్మెద  తరిమేనే .. రమ్మని నా చెలి పిలిచేనే ..

ఆ పిలుపే మోహన రాగపు ఒరవడి నే తలపించేనే ..

అల్లరి ఊహలు రేగేనే .. అలజడి ఇక చెలరేగేనే ..

కవులెందరో రాసిన దైనా ప్రేమ ఎపుడు కొత్త కావ్యమే ...






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Saturday, 7 June 2014

రుధిర సౌధం 166


అర్థరాత్రి తలుపులు దబదబా బాదుతున్న చప్పుడు విని ఉలిక్కిపడి లేచాడు రత్నం రాజు ... కళ్ళు నులుము

కుంటూ గోడ మీదున్న గడియారం వైపు చూశాడు . సమయం 3 గం అవ్వొస్తుంది ..

ఈ సమయం లో ఎవ్వరు ? వెంగమ్మ హాల్లో పడుకుని ఉండాలి కదా .. తలుపు తీయదెం .. అనుకుంటూనే మంచం

మీది నుంచి లేచి హాల్ లోకి నడిచాడు . ఏం తిన్నదో గానీ గుర్రు పెట్టి నిద్రపోతోంది వెంగమ్మ వంటింట్లోంచి గురక విన

బడుతుంది . విసుక్కుంటూనే వెళ్లి తలుపులు తీశాడు రత్నం రాజు .

ఎదురుగా ఉన్న వ్యక్తులని చూసి .. మీరా ? ఈ వేళలో వచ్చారేం ? అన్నాడు విసుగ్గా ..

అయ్యా .. ఉన్న పళానే అయ్యగారితో మాటాడలయ్యా .. అన్నాడు వగరుస్తూ వాళ్ళలో ఒకడు ...

ఎందుకింత కంగారుగా ఉన్నారు ? ఐనా నాన్న గారు నిద్రమాత్ర వేసుకొని పడుకుంటారు .. ఆయన లేవరు ..

ఏమైంది ? విషయం నాతో చెప్పండి అన్నాడు రత్నం రాజు ..

అయ్యా ... ఆ పిల్ల ధాత్రి లేదూ .. ఆ పిల్ల ఆ పాడుబడ్డ కోటలో ఉందయ్యా .. మేము సరస్వతి ని తీసుకెళ్ళే సరికి

పేనాలు పోగొట్టుకునే స్థితి లో ఉందయ్యా .. అన్నాడు ఒకడు ..

ఏంటీ ధాత్రి అపాయం లో ఉందా? పాడుబడ్డ కోటలోనా ? నిర్ఘాంత పోతూ అడిగాడు .. రత్నం రాజు .. అతడి నిద్రంతా

ఎగిరిపోయింది ..

అదీ .. అని నసిగాడు .. వాడు .

అయ్యో .. అక్కడికెల్లిన వాళ్ళు తిరిగిరారంటారే .. ఇప్పుడెలా ? అంటూ ..  గుమ్మం ఒక్క ఉదుటున జీప్ దగ్గరకి

పరుగు తీసి .. జీప్ స్టార్ట్ చేసుకొని వెంటనే అక్కడి నుండి కనుమరుగయ్యాడు రత్నం రాజు .

అదేమిట్రా ... మనం చెప్పేది పూర్తిగా వినకుండా చిన బాబు ఎక్కడికి పోతుండు .. అయోమయం గా అన్నాడు వాడు

ఏమోరా .. ఈ పెద్దోల్ల పనులు చిత్రంగా ఉంటాయి .. పెద్దయ్య లేవడు  అని చినబాబు చెప్పినాడు కదా .. పద పూర్తిగా

తెల్లవారాక వద్దాం .. అన్నాడు ఇంకొకడు .

అలానే అంటావా? చినబాబు ఎక్కడికి పోయుండో ఏమో .. పద వెళ్దాం .. అని అక్కడ నుండి కదిలారు ఆ ఇద్దరూ ..

రత్నరాజు మనసులో వేరే ఆలోచన లేదు .. ధాత్రి అపాయం లో ఉందన్న ఆలోచన తప్ప ... ధాత్రీ .. ఎందుకలా

చేసావు .. నీకేమన్నా జరిగితే తట్టుకోగలనా .. ? ఇంతవరకు ప్రేమ రుచి ఎరుగని నాకు ప్రేమ ని పరిచయం చేసావు .

నీతో జీవితాన్ని పంచుకోవాలన్న నా కోరిక .. మధ్యంతరం గా ఆగిపోరాదు .. నిన్ను ఎలా గన్న రక్షించుకోవాలి ..

అతడి ఆలోచనల్లాగే జీప్ కూడా ఆ మట్టి రోడ్ లపై పరుగు తీస్తుంది ...

అదే సమయం లో యశ్వంత్ , మురారి , శివ లు పాడుబడ్డ కోట ని చేరుకున్నారు ...

యశ్ .. వాళ్ళు లోపల ఉండుండాలి .. మనం అప్రమత్తం గా ఉండాలి .. రచన ,సత్య ల  జాడ కూడా తెలుసుకోవాలి ..

అన్నాడు మురారి ...

కింద ఉన్న ఓ కర్ర ని అందుకుంటూ వెనక వైపు నుంచి వెళ్దాం .. అన్నాడు యశ్వంత్ ..

వారిద్దరూ  కూడా చెరో కర్రని తీసుకొని యశ్వంత్ ని అనుసరించారు

ఇంకా ఉంది 



..
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 6 June 2014

రుధిర సౌధం 165

కింద పడున్న సత్య చుట్టూ ఓ అగ్ని రేఖ గీయబడి ఉంది .. ఆమె మధ్యలో తీవ్ర మైన యాతన పడుతూ ఉంది ..

త్వరగా వీరస్వామి .. నేను సత్యని అలా చూడలేను .. ఆమె ఇప్పటివరకూ పడ్డ బాధ చాలు .. ఆవేదన గా అంది

రచన .

ధాత్రమ్మా ... అసలేం జరిగింది సత్యమ్మ కి ? ఆందోళన గా అంది సరస్వతి ..

ఇప్పుడు నేను నీకు ఏ వివరాలు చెప్పలేను .. సరస్వతీ .. అని మళ్ళి వీరస్వామి వైపు చూసింది రచన .

అతడు కళ్ళు తెరచి చూసి .. ఈమె ప్రాణం  తో పోరాటం చేస్తుంది .. ముందు ఇక్కడి నుండి ఈమె ని తీసుకుపోవాలి .

అన్నాడు వీరస్వామి సాలోచన గా .

వీరస్వామి .. నేను అదే అంటున్నాను .. నీకేం అర్థమైంది మరి .. సత్య ని తీసుకుపోవాలంటే ముందీ రేఖ దాటాలి

కదా .. అ0ది చిరాగ్గా రచన .

ఈమె ని నేను భూత రేఖ దాటిస్తాను .. మీ ఇరువురూ ఈమె ని పట్టుకొని ఇక్కడినుంచి వెంటనే వెళ్ళిపొండి .. వెళ్ళే

టప్పుడు పొరపాటున కూడా వెనుదిరిగి చూడరాదు .. అలా చూస్తె ఈమె ప్రాణానికి ముప్పు వాటిల్ల వచ్చు ...

అన్నాడు .. వీరస్వామి .

అలాగే .. ముందా పని కానీ అంది రచన ఆత్రుత గా .

వీరస్వామి మరల కళ్ళు మూసుకొని ఏదో మంత్రం జపించాడు .. అంతవరకూ నేల పై నిస్సహాయం గా పడున్న

సత్య పడుకున్నట్టు గానే గాలిలోకి ఎగసింది


..

రచన ఆశ్చర్యంగా చూసింది .. సరస్వతి గొంతు తడారిపోతుంది .. ..

గాలిలోకి ఎగసిన ఆమె అలా ముందుకి వచ్చింది .. భూత రేఖ దాటి ఆమె శరీరం అచేతనావస్థ లో రచన ముందు

గాలిలో తేలుతూ ఉంది .. ఆమె సంకోచం , ఆశ్చర్యం కలగలిసిన చూపు తో వీరస్వామి కేసి చూసింది ..

మీరు నడవండి .. ఇక్కడి నుండి .. మీరు వెనుదిరగ కుండా నడుస్తున్నంత సేపు ఈమె కూడా గాలిలో తేలుతూ

మీతో వస్తుంది .. ఊరి పొలిమేరల్లో అడుగుపెట్టగానే  ఈమె శరీరం నేల తాకుతుంది .. జాగ్రత్త .. అన్నాడు వీరస్వామి

రచన అర్థమైందన్నట్టు తలూపి .. ఒకసారి ఆ జాడీల వైపు చూసింది ..

అనుమానం వద్దు .. వాటిని నేను ఏం చేయాలో అదే చేస్తాను .. ముందు మీరు బయలు దేరండి అన్నాడు

వీరస్వామి .

అలాగే వీరస్వామి  అని .. సరస్వతి వైపు తిరిగి .. సరస్వతీ .. నీకు అర్థమైంది గా .. అతనేం చెప్పాడో .. అంది రచన .

అర్థమైనదమ్మ .. మనం పొలిమేర దాకా వేనుదిరక్కుండానే పోదాం .. సత్యమ్మ ని కాపాడుకుందాం .. అంది

సరస్వతి .

సరే పద .. అని ముందు కి నడిచింది రచన .. ఆమె వెనుకాలే సరస్వతి .. వారి ముందు గాలిలో కదలాడుతూ సత్య .

వారు అలా సాగగానే కింద పెట్టిన జాడీలని తీసుకొని కదిలాడు వీరస్వామి .

ఇంకా ఉంది 

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 5 June 2014

రుధిర సౌధం 164



వీరస్వామి ఇంకా ఉధృతం గా ఏదో మంత్రం ఉచ్చరించాడు .. ఉన్నట్టుండి పరిస్థితి మళ్ళి మొదటికి వచ్చింది ..

ముగ్గు మధ్యలో ఉన్న జాడీ తెల్లని పొగతో నిండింది . వీరస్వామి కళ్ళు తెరచి జాడీ నాడా గట్టిగా బిగించాడు ...

రచన అది చూసి హమ్మయ్య అనుకొంది .. సరస్వతి మెల్లిగా లేచి వీళ్ళ దగ్గరికి వచ్చింది ..

రెండు జాడీ లను ఒక పక్క పెట్టి .. రచన వైపు చూసాడు .. వీరస్వామి ..

ఆమె అతడి వంక కృతజ్ఞత గా చూసింది ..

చూసుకో అమ్మడు .. ఒక జాడీ లో ఆ మహల్ యువరాణి .. మరో జాడి లో బసవన్న .. నువ్వు కోరినట్టే బంధింప

బడి ఉన్నారు .. అన్నాడు వీరస్వామి ...

చాలా థాంక్స్ వీరస్వామి .. నువ్వు నా దగ్గర భయపడలేదు .. కానీ ఇదంతా చేసావు .. ఎందువల్ల ?నువ్వు భూపతి

మనిషి వి .. కానీ నాకు సహాయం చేయటం లో నీ ఉద్దేశ్యం ఏంటి ? అంది రచన .

ముందు నేను ఓ మాట అడుగు తానే  అమ్మడు .. నువ్వు రాచబిడ్డవి .. అవునా ?అన్నాడు వీరస్వామి .

రచన విస్తుపోయి చూసింది ..

జవాబు రాకపోయినా నీ చూపు  సమాధానం చెప్పింది .. నువ్వు రాచ బిడ్డవేనని .. నాక్కావలసింది అదే ..

రాణి మహల్ కి వారసులు ఉన్నారని నాకు తెలుసు .. నువ్వు నేను నీ నుండి ఏమి ఆసిస్తానో అని

ఆలోచిస్తున్నావు .. అవును ఆసిస్తుండా .. మహల్ లో దేవాలయం ఉన్నాది .. అమ్మోరు మెడలో హారం .. పచ్చల

హారం .. మహిమ గల హారం .. ఎవడి కాడ ఉంటె ఆడి ప్రతి కోరికా సిద్ధిస్తాది .. నాకా హారం గావాలె .. అది నువ్వే

తేవాలే .. అన్నాడు వీరస్వామి .

ఎంత ధైర్యం నన్ను ఇలా అడగటానికి అంది రచన ..

సరస్వతి వీరి మాటలు ఆశ్చర్యం తో వింటుంది ..

చూడు పిల్లా .. ఈ జాడీలు నాకాడే ఉంటాయి .. నువ్వు హారం తెచ్చిచ్చే దాకా .. లేదంటే ఈ జాడీ లు నేనే

పగలగొడతా .. నిస్సహాయం గా ఉన్న ఈ ప్రేతాత్మలు అరివీర భయంకరం గా మారుతాయి .. నీ ఇష్టం .. అన్నాడు

వీరస్వామి .

ఓ క్షణం ఆలోచనలో పడినా వెంటనే తేరుకొని .. అలాగే వీరస్వామి .. కానీ నువ్వు మరో సహాయం చేయాలి ..

సత్య ని ఆ భూతావరణం నుండి విడుదల చెయ్యి .. అంది రచన .

అలాగే తప్పక ప్రయత్నిస్తాను .. ముందు నువ్విక్కడ నుండి వెళ్ళు .. వెళ్లి హారం తీసుకురా అన్నాడు వీరస్వామి .

ఇప్పటి కిప్పుడు కుదిరే పని కాదది వీరస్వామి . కానీ నేను మాటిస్తున్నాను .. ముందు ఈ రెండు జాడీ లని

భద్రపరచు అంది రచన .

నేను నేల లో పాతిపెడతాను . నీ స్నేహితురాలిని భూత రేఖ నుండి బయటకి తెగలను .. కాని ఆ చెడు ప్రభావాన్ని

మాత్రం దైవబలం ఉన్నవారు మాత్రమే తీసేయగలరు .. అని కొంచెం దూరం లో కింద పడున్న సత్య దగ్గరకి వెళ్లి

ఏదో మంత్రం జపించాడు .

ఇంకా ఉంది





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday, 3 June 2014

రుధిర సౌధం 163



వీరాస్వామి ఏకాగ్రత తో మంత్రాలు చదువుతున్నాడు . ఉన్నట్టుండి అక్కడి వాతావరణం లో మార్పు రాసాగింది ...

గాలి వేగం పెరిగింది .. ఎండిన ఆకులు చెల్లాచెదురుగా ఎగురుతున్నాయి .. ఆకాశం వివిధ వర్ణాలలో కనబడ

సాగింది ..

రచన నొసలు చిట్లించి చుట్టూరా చూసింది .. సరస్వతి భయం భయం గా చూసింది ..

అమ్మో .. ఏదో జరగ బోతా ఉంది .. వీరస్వామి కళ్ళు తెరువు .. అన్నాడు భయం గా బాలయ్య .. కూర్చున్న చోటి

నుండి దిగ్గున లేచి .

బాలయ్య అలా అనడం తో వీరస్వామి ఏం చేస్తాడో అని   అనుమానం గా అతడి వైపు చూసింది రచన . కానీ అతడు

కళ్ళు తెరవలేదు .. సరికదా అతని మొహం లో ఇంకాస్త సీరియస్ నెస్ కనిపించింది ఆమె కి .

"ఖచ్చితంగా వీరస్వామి వైజయంతి ని బంధిస్తాడు .. కారణం తెలీదు కానీ .. ఈ విషయం లో నాకు సహాయం చేసి

తీరతాడు . కానీ దానికి ప్రతిఫలం నానుంచి ఏం ఆశిస్తున్నాడో .. మాత్రం ఊహ కి అందడం లేదు ..  అనుకొని పక్కనే

ఉన్న సరస్వతి వైపు చూసింది రచన .

ఆమె భయం తో వణకు తుంది ..

సరస్వతీ .. భయపడకు .. ఏమీ కాదు .. ధైర్యం గా ఉండు .. నేనున్నాగా .. అంది రచన .

ఆమె బేలగా అలాగే నంటూ తల ఊపింది ,

"ఈ సరస్వతి ని వీళ్ళే బంధించారన్న మాట .. అంటే వెనుక భూపతి .. ఉన్నాడు .. భూపతీ .. నీ పాపం పండే రోజు

తొందరలోనే ఉంది .. సరస్వతి కన్నా గొప్ప ఆధారం ఉందా ? నీ పనులు బయట పడటానికి .. ముందీ విషయం

తేలనీ .. తరువాత నీ పని చెప్తా .. " అనుకొంది మనసులో రచన .

రచన గన్ దించి ఏదో ఆలోచన లో ఉండటం గమనించిన బాలయ్య  అక్కడి నుండి తప్పించుకోవటానికి రెండు

అడుగులు వెనక్కి వేసి పరుగు తీయబోయాడు ..

ఆగు బాలయ్యా .. లేదంటే ఈ గన్ ముందు నీ ప్రాణం తీస్తుంది అంది రచన ..

అతడు భయం గా వెనక వైపు చూసి .. పోయినా చచ్చేట్టు ఉన్నాను .. ఉన్నా చచ్చేట్టు ఉన్నాను .. అన్నాడు .

అవును .. భూపతి లాంటి మనిషి కి చేదోడు వాదోడు గా ఉండేవాడివి .. ఏదో రోజు ఇలాంటి పరిస్థితి నీకు తప్పదు

బాలయ్యా .. అదే విధి .. నోర్ముసుకొని అక్కడే కూర్చో .. హూం .. అని ఘీంకరించింది రచన .

చేసేదేం లేక ముంగాళ్ళ మీద కూర్చున్నాడు బాలయ్య ..

ఎక్కడో నక్క భయంకరం గా ఊళ వేస్తుంది .. గాలివేగం హెచ్చింది .. ఆ పాడుబడిన గోడలు విరిగి మీద పడతాయా

అన్నట్టుగా ..

ఉన్నట్టుండి గాలివాన .. పూజా వస్తువులన్నీ చెల్లచెదురవుతున్నాయి .. ముగ్గు మధ్యలో ఉన్న జాడీ మాత్రం

కదలటం లేదు .. ఉన్నట్టుండి రచన చుట్టూ ఓ గాలి చేరి ఆమె ని గిర్రున తిప్పింది .. సరస్వతి ని ఒక్కసారిగా గాలి

లోకి లేపి ఎత్తి కుదేసింది ..

బాలయ్య .. భయం తో ఎప్పుడో కళ్ళు తిరిగి నేల మీద పడ్డాడు .

వీరస్వామి .. వైజయంతి ని కట్టడి చెయ్ .. అంటూ గట్టిగా అరచింది రచన .

ఇంకా ఉంది




 



మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 2 June 2014

రుధిర సౌధం 162


రచన ఆసక్తిగా చూస్తుంది వీరస్వామి పూజ .. అతనేదో మంత్రాలు వల్లిస్తున్నాడు . బాలయ్య అతడి మొహం కేసే

చూస్తున్నాడు .. సరస్వతి ఆందోళన గా చూస్తూ అంది ..

ధాత్రమ్మా .. వీడు మీరు చెప్పినట్టే పూజ చేస్తున్నాడో .. లేక .. అని అనబోతుండగా ..

వీరస్వామి గీసిన ముగ్గు మధ్యలో ఉన్న గాజు జాడీ లోకి ఒక తెల్లని పొగ ప్రవేశించడం చూసి నోరెళ్ళ బెట్టింది .. ...

  రచన నొసలు చిట్లించి జాడీ వైపు చూసింది .. బాలయ్య కూడా జాడీ వైపు వీరస్వామి వైపు అయోమయం గా

చూశాడు .

వీరస్వామి మెల్లిగా కనులు తెరచి తన ఎదురుగా ఉన్న జాడీ వైపు చూశాడు .. అందులో తెల్లని పొగ

దోబూచులాడుతుంది .. అతడు ఏదో మంత్రం పటిస్తూ ఆ జాడీ నాడా గట్టిగా బిగించాడు .

నాడా బిగించాక బుట్ట లోంచి ఇంకో జాడీ తీసి పాత జాడీ ని ఓ పక్క గా పెట్టి ఆ జాడీ ని ముగ్గు మధ్యలో పెట్టాడు .

తరువాత కళ్ళెత్తి రచన వైపు .. చూసి .. నువ్వు చెప్పినట్టే చేసాను .. వాడు .. ఆ జాడీ లోనే ఉన్నాడు ... బసవడు .

అన్నాడు వీరస్వామి .

ఇక వైజయంతి పని చూడు .. అంది గంభీరంగా రచన .

హా.. అని మళ్ళి కళ్ళు మూసుకున్నాడు వీరస్వామి ..

ఏమిటీ వీరస్వామి .. ఏం చేస్తున్నాడు ? ఈ పిల్ల ని కూడా బంధించి పడెయ్యక ఆ పిల్ల చెప్పిన పని చేస్తాడేంటి ??

అయినా ఆ పిల్ల చేతిలో గన్ ఉంది .. ఆ పిల్లే చెప్పింది గా  మంత్రం చెప్పేలోగా గన్ పేలుతుందని .. అంటే వీరస్వామి

లాంటి మంత్రగాడ్ని కూడా ఈ పిల్ల గన్ తో భయపెట్టేసిందే .. అయినా ఆ గన్ ఎంత బావుందో .. ఈ పనయ్యాక

ఆ పిల్ల నడిగి ఒక్కసారి గన్ పట్టుకుంటానని అడిగితె సరి .. అనుకున్నాడు రచన చేతిలోని గన్ వైపు తదేకం గా

చూస్తూ  ...

ధాత్రమ్మా .. ఈ వీరస్వామి మీ చేతిలోని గన్ చూసే భయపడుతున్నాడా ? కొంచెం ఆలోచించండి .. వాడొక్క

మంత్రం చదివితే మీ చేతిలోని గన్ అవతలకి ఎగిరిపడుతుంది .. వాడికసలు మీరు చెప్పింది వినే అవసరమే లేదు .

అంది మెల్లిగా రచన చెవిలో నే . .. వినబడే టట్టుగా .. సరస్వతి .

రచన గన్ ని కిందకి పెట్టి సరస్వతి కేసి చూసింది .. సరస్వతి ఆమె ని చూసి ఆలోచించండి .. అన్నట్టుగా కనుసైగ

చేసింది .

రచన వీరస్వామి కేసి చూసింది .. అతడు కళ్ళు మూసుకొని మంత్రాలు ఉచ్చారిస్తున్నాడు .. బాలయ్య .. అతడి

పక్కనే కూర్చుని రచన గన్ వైపే చూస్తున్నాడు .. వీరస్వామి పక్కన పెట్టిన జాడీ లో తెల్లని పొగ కదలాడుతుంది .

"సరస్వతి చెప్పింది నిజమే .. యితడు నా మాట విన్నాడంటే నానుంచి ఏదో ప్రయోజనం ఆశిస్తుండ వచ్చు ......

అది ఏమై ఉంటుంది .. ? ఏదేమైనా ముందు వైజయంతి ని బంధించాలి .. తరువాత ఏం చేయాలన్నది ఆలోచిస్తాను".

అనుకొంది రచన .


ఇంకా ఉంది


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

రుధిర సౌధం 161

ఏరోజు ? ఆసక్తిగా అడిగాడు యశ్వంత్ .

మరో రెండు రోజులలో పౌర్ణమి .. అదే రోజు .. అమ్మవారు ఇక్కడ నుండి అక్కడ కి పయనం కానున్నదట ..

అన్నాడు ఆ ముసలాయన .

ఆ మాట వినగానే యశ్వంత్ ఒళ్ళు జలదరించింది .

అప్రయత్నంగా ఆ విగ్రహం వద్దకి వెళ్లి చేతులు జోడించి నమస్కరించాడు .

అమ్మా .. ఇప్పుడు అర్థమైంది .. మేమేదో సాధించేసాం అని మేము విర్రవీగుతాం .. కానీ అంతా నువ్వు ఆడించే ఆట

అంతా ముందే నిర్ణయింపబడింది . అందుకే నువ్వొచ్చే ముహూర్తాన్ని కూడా ముందే నిర్ణయించావు . అంతా నువ్వే

చేస్తున్నావు .. నిమిత్తమాత్రులం మేము . నువ్వు ఈ  పౌర్ణమికి ఆలయానికి వస్తున్నావంటే దుష్ట సంహారం కూడా

జరగానున్దనేగా అర్థం . ఇంతవరకు మనసులో ఏదో మూల ఏదో అనుమానం .. కానీ ఇప్పుడు నా మనసు

మబ్బులు లేని ఆకాశం లో వెన్నెల వేదజల్లుతున్నట్లు ఉంది .. అన్నాడు యశ్వంత్ ఆర్తిగా .

ఏమంటున్నారు మీరు ? అన్నాడు చిన్నారావు ఆశ్చర్యం గా ..

యశ్వంత్ అతడికేసి చూసి .. మీరు కలవటం నాకు చాలా మంచి జరిగింది .. పౌర్ణమి రోజు మహల్లో అమ్మవారి ని

ఆహ్వానిస్తాం . అందుకు మేము సంసిద్ధం గా ఉంటాము . మీరు పౌర్ణమి నాటికి ఆలయానికి చేరుకోండి .. అన్నాడు

యశ్వంత్ .

మీ మాటలు మాకు ఆశ్చర్యాన్ని కలగజేస్తున్నాయి .. అన్నాడు అతడు ..

నిజమే .. కానీ కొన్నింటికి జవాబులు అంత తేలిగ్గా చెప్పటం కష్టం .. మీ ప్రస్నాలన్నింటికి సమాధానాలు అప్పుడే

దొరుకుతాయి .. ఇక మాకు సెలవిప్పించండి .. అన్నాడు యశ్వంత్ .

ఆ ముసలాయన మెల్లిగా తల ఊపి .. అమ్మా సీతా వారికి అమ్మవారి ప్రసాదం .. కుంకుమ ఇవ్వు .. అని కోడల్ని

ఆదేశించాడు .

ఆమె యశ్వంత్ , మురారి , శివ లకి ప్రసాదం .. కుంకుమ తెచ్చి ఇచ్చింది . కుంకుమ ని శిరసున ధరించి

అమ్మవారికి మనసారా నమస్కరించి కోట వైపు అడు గులేసారు ఆ స్నేహితులు ముగ్గురూ ..

వాళ్ళలా వెళ్లిపోతుంటే .. నాన్నా .. వాళ్ళ మాటలు నాకేం అర్థం కాలేదు .. అన్నాడు చిన్నారావు .

ఒక ప్రశ్న ఉదయించటం తోనే దాని సమాధానం కూడా పుడుతుంది .. దానికోసం వెదుకులాట తప్పదు .. మా

నాన్న చెప్పినట్టు అమ్మవారు నిజంగా ఇక్కడ నుంచి వేల్లిపోతుందా అనుకునేవాడిని .. కానీ ఈరోజు ఆ యువకుని

మాటల్లో అది నిజం గా జరగనున్నదని అనిపించింది .. అన్నాడు పరంధాముడు .

అయ్యో .. నాన్నా .. మనం అతడి పేరు కూడా అడగనే లేదు .. అన్నాడు చిన్నారావు ..

అతడిని కలవటానికి పేరుతో పనేముంది .. పౌర్ణమి నాడు .. మహల్లో అతడు మనకి కలవ నున్నాడని

అర్థమవుతుంది కదా .. అన్నాడు ఆ ముసలాయన .

చిన్నగా తలూపాడు చిన్నారావు .

ఇంకా ఉంది





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది