Powered By Blogger

Saturday, 12 July 2014

రుధిర సౌధం 194

నిజమే యశ్ .. ఆ హారం తో వాడెం చేసుకుంటాడో .. ఈ మహల్లో వైజయంతి అన్న క్యారెక్టర్ లేదన్న మాట ఎంత

ప్రశాంతత నిస్తుంది . యు డిడ్ ఏ రైట్ జాబ్ రచన .. అన్నాడు శివ .

అది నీ ఫ్రెండ్ కి చెప్పు ... చూడు ఇంకా పేస్ ఎలా పెట్టాడో .. నాకు పనుంది నే వెళ్తున్నా .. అని అక్కడ్నించి వెళ్లి

పోయింది రచన .

ఏంట్రా అంత ఆలోచిస్తున్నావు ? అన్నాడు శివ .

శివా .. వీరస్వామి కి ఆ హారం ఎంత ప్లస్ అవ్వకపోతే భూపతిని కూడా కాదనుకుంటాడు . ముందు ఆ హారం గొప్ప

తనం ఏంటో తెల్సుకోవాలి .. వాడేందుకు ఆ హారం కావాలనుకుంటున్నాడో మనం తెల్సుకోవాలి అన్నాడు

యశ్వంత్ .

ఎంత గొప్ప హారమైనా సరే ఇప్పుడు అదే వైజయంతి సమస్య కి పరిష్కారం .. మనం దానిని  ఇవ్వకుంటే

సమస్య    మళ్ళి  వెనక్కి వస్తే .. అమ్మో ఊహించడానికే భయంగా ఉంది .. లేట్ ఇట్  బి .. వదిలేద్దాం ...

నువ్వింకా దాని గురించి ఆలోచించకు అన్నాడు శివ .

సాలోచన గానే తల ఊపాడు యశ్వంత్ .

                                                    *********************


కాలి నడకన పయనం సాగిస్తున్న రమణానంద మహర్షి నాసికా పుటలకి అద్భుత మైన సువాసన తాకింది ...

అతడి పెదవుల పై చిరునవ్వు విరిసింది ..

అడుగులు మరింత వేగం గా ముందుకి పడసాగాయి ..

వనమంతా అత్యంత సౌందర్య భరితం గా ఉంది .. దగ్గరలోనే ఉన్న సెలయేటి గలగల మంద్రంగా వినబడుతుంది .

చిరుగాలి ఆప్యాయంగా స్పర్శిస్తుంది ...

అతడు ముందుకి నడుస్తున్న వాడల్లా ఒక్క క్షణం హటాత్తుగా ఆగిపోయాడు .

అతడి కనులకి కనబడుతున్న దృశ్యం అతడిని మంత్ర ముగ్దుడిని చేసింది .

సెలయేటి ఒడ్డున ఆసనం లా ఉన్న ఓ రాతి మీద ఓ స్త్రీ వయ్యారం గా కూర్చుని ఉంది .. ఆమె పెదవులు సన్నని

కూనిరాగం తీస్తున్నాయి ... ఆ రాగానికి తాళం వేస్తున్నట్టు ఉంది సెలయేటి సడి .

ఆమె విరబూసిన కురులు చిరుగాలికి నాట్యం చేస్తున్నాయి ...

అతడు టక్కున తేరుకుని ఆమె వైపు నడచి ఆమె ముందు మోకరిల్లాడు ...


ఆమె చిరునవ్వుతో అతడిని చూసింది ...

అమ్మా .. మళ్ళి  ఇన్నాళ్ళకి నీ దర్శన భాగ్యం .. ఈ దీనుడిని ఇలా కనికరించావా తల్లీ .. అన్నాడు చిప్పిల్లిన

కన్నీటి చూపులతో రమణానందుడు .

నేను నీ కొరకే వేచి ఉన్నాను రమణానంద ... మనసు సంతోషం లో తేలియాడుతుంది .. నా ఇంటికి నేను

చేరుకోబోతున్న సంతోషం సుమా ఇది ... ముహూర్తం నీ ద్వారా నిర్ణయింప బడుతుంది .. మరి నేను నీ కొరకు

వేచి ఉండక తప్పదు కదా .. అంది ఆమె సుమధుర స్వరం తో ..  

ఇంకా ఉంది






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 11 July 2014

రుధిర సౌధం 193




అవును యశ్వంత్ . ఇప్పుడు మనల్ని నమ్మి ఇంత జనం ఇక్కడికి వచ్చారు . వీళ్ళకి ఎటువంటి అపాయం

ఎదురవకూడదు కదా ... అదుగో రచన వాళ్ళందర్నీ మహాల్లోకి తీసుకు వెళ్తోంది .. మనం వెళ్దాం యశ్ .. రచన

కిప్పుడే ఈ విషయం కోసం అడుగుదాం .. అన్నాడు శివ .

ఇద్దరూ .. కంగారుగా మహల్ ద్వారం వైపు పరుగుతీసారు .

రచన .. అందరికీ తలో పనీ ఒప్పజేబుతుంది ..

వీళ్ళిద్దర్నీ చూసి .. అప్పుడే చదవడం పూర్తయిందా ? అలా జరిగే వీల్లేదే .. అంది రచన .

అసలు మొదలు పెట్టలేదు .. ఒక్కసారి నువ్విలా రా .. నీతో మాట్లాడాలి .. అన్నాడు యశ్వంత్ .

యశ్ .. ఇక్కడ పని పూర్తి కావాలి .. సరే .. అని వీరి వద్దకి  వచ్చి చెప్పు .. ఏం చెప్పాలి మీకు ? అంది రచన .

వైజయంతి కోసం చెప్పు ? అన్నాడు యశ్వంత్ సీరియస్ గా .

ఆ మాట వినగానే ఆమె మొహం లో రంగులు మారాయి ...

చెప్పు రచనా ? కోటలో ఏం జరిగింది ? వైజయంతి పీడ పూర్తిగా పోయిందా ? నువ్వా మాట చెబితే మేము

ప్రశాంతంగా ఉంటాం కదా .. అన్నాడు యశ్వంత్ .

యశ్ .. వైజయంతి ని , బసవరాజు ని ఇద్దర్నీ వీరస్వామి బంధించి ఉంచాడు .. అంది రచన .

 వీరాస్వామా ? ఇద్దరూ  ఒకేసారి ఆశ్చర్యం గా అన్నారు ... యశ్వంత్ ,శివ

చిన్నగా తల ఊపి అవును ... తనే .. మనకి సహాయం చేసాడు . ఒక చిన్న డీల్ .. తనతో అంతే .. అంది రచన .

రచనా .. మనం భూపతిని దోషిగా  నిలబెట్టాం .. వీరస్వామి భూపతి మనిషి .. తన పాపాలలో  అధిక శాతం

వీరస్వామి కి వాటా  ఉంది .. అన్నాడు శివ .

అవును నిజమే .. కానీ  వీరా స్వామి స్వార్థ పరుడు . ఇప్పుడు భూపతి వెంట ఉండటం కంటే మనల్ని

నమ్మటమే  మంచిదని అతడు భావించాడు . ఎవ్వరూ మునిగి పోతున్న పడవ ఎక్కాలనుకోరు కదా ... అంది

రచన .

డీల్ ఏంటి రచనా ? వాడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు ? అన్నాడు సీరియస్ గా యశ్వంత్ .

వాడు చేసిన తప్పులకి శిక్ష పడకుండా చేయమని అడిగి ఉంటాడు .. అన్నాడు శివ .

లేదు శివా ... వాడు అమ్మవారి మెడలో ఉన్న హారం అడిగాడు . గుడి నాచే తప్పక తెరవబడుతుందని అతడు

నమ్మాడు . అమ్మవారి మెడలో పురాతన హారం ఏదో ఉందట . అదిస్తే .. వైజయంతి పీడ పూర్తిగా తొలగిస్తానని

చెప్పాడు . ఈ ఊరి క్షేమం కంటే , ఈ మహల్ పునరుద్ధరణ కంటే ఆ హారం ఏ మాత్రం గొప్ప . అందుకే మాటిచ్చాను

గుడి తెరవగానే ఆ హారాన్ని అతడికి ఇస్తానని . వైజయంతి నాశనం పూర్తిగా జరిగిపోవాలి .. అంది సాలోచన

గా   రచన .

అతడు ఆ హారం అడిగాడంటే .. ఈ భూపతి కూడా ఆ హారం కోసం ప్రయత్నించాడు అంటే .. ఆ హారం వెనుక

ఏదో ఉంది .. అన్నాడు యశ్వంత్ .

అదేమైనా యశ్ .. నాకు వైజయంతి నాశనమే ముఖ్యం అంది రచన .

ఇంకా ఉంది








మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 10 July 2014

రుధిర సౌధం 192



యశ్ .. నువ్వు దేనికోసం మాట్లాడుతున్నావో అర్థమవుతుంది . కానీ మనకి సమయం తక్కువ ఉంది . రేపే

పౌర్ణమి.. రేపీ పాటి కల్లా మహల్ కళకళ లాడాలి . ఈ సంతోష సమయం లో అమ్మ , అన్నయ్య కూడా నాతొ ఉంటె

బావుండేది . సత్య సంతోషం గా తిరగగలిగి ఉంటె ఇంకా బావుండేది .. అంది రచన .

రచనా .. ఈ సంతోశాలన్నింటికి మూలం మనం గుడి తెరవటం .. నువ్వు దానికోసం మాట్లాడటం లేదేంటి ?

అన్నాడు యశ్వంత్ .


ఓహ్ .. సారీ యశ్ .. దానికి పరిష్కారం నాకు నిన్న రాత్రే దొరికింది .. కానీ మీకు చెప్పే అవకాశం రాలేదు .. అని

పక్కనే ఉన్న తన హ్యాండ్ బాగ్ లోని ఒక తాళ పత్ర గ్రంథం బయటికి తీసి .. మీ ఇద్దరూ చిన్నప్పుడు సంస్కృతం

చదువుకునే ఉండుంటారు గా . ఇది చదవండి .. అన్నీ మీకే అర్థమవుతాయి .. అని వారికి అందించింది రచన .

ఏంటిది రచనా ? అని దానివైపు విచిత్రం గా చూస్తూ అడిగాడు యశ్వంత్ .

వైష్ణవీ మాత ఆలయం .. సరస్వతి వాళ్ళ పూర్వీకులే కట్టారు . నాకు తాత ఆ విషయం రాత్రి చెప్పాడు . ఈ గ్రంథం

వాళ్ళ వంశీకుల వారసత్వ ఆస్తి . ఇందులో మన గుడి గురించి కూడా రాసి ఉంది .. అన్ని వివరంగా .. అంది రచన

చిరునవ్వుతో ..

అయితే .. మనకి సొల్యూషన్ దొరికేసి నట్లే .. అన్నాడు శివ .

అవును శివా .. ఈ గ్రంథం కూడా చాలా తెలివిగా రాసారు . నాకు అర్థం చేసుకోడానికి చాల సమయం పట్టింది ..

మీరు ట్రై చేయండి అంది రచన .

సరే ముందు నువ్వు వెళ్ళు రచనా .. వాళ్ళైతే నీకోసం ఎదురు చూస్తున్నారు గా ... అన్నాడు శివ .

వెళ్తాను .. మహల్ శుభ్రం చేశాక వెహికల్ తీసుకు వెళ్లి సత్య , మురారి లను తీసుకురా .. అంది రచన .

అలాగే .. నువ్వు వెళ్ళు .. అన్నడు శివ .

రచన ఆ ఆడవాళ్ళు కూర్చున్న మంటపం వైపు నడిచింది .

యశ్ .. ఆ కోటలో ఏం జరిగింది రచన   చెప్పిందా ఏమైనా ? అని అడిగాడు శివ .

లేదు శివా .. కానీ ఇప్పుడు అంతా  ప్రశాంతం గా ఉంది .. మన మనసులు కూడా .. అంతా  విధాత్రి చెప్పినట్టే

జరుగుతోంది .. చిక్కుముల్లన్నీ  వా టoతట అవే వీడిపోతున్నట్టు లేవూ .. ఇప్పుడు గుడి ద్వారం ఎలా తెరవాలో

అన్న సమస్య కి పరిష్కారం కూడా మన చేతిలో ఉంది .. భవిష్యత్తు ఈ ఊరి ని కూడా ఆహ్వానిస్తుంది .. అన్నాడు

యశ్వంత్ .

నిజమే యశ్ .. ఇది సంతోషాలను పంచుకోవాల్సిన సమయం .. చేదు జ్ఞాపకాలని కాదు . ఏం జరిగినా

ఇప్పుడంతా  మంచే జరుగుతోంది .. ఒక్క సత్య విషయం తప్ప . తను మనతో ఇప్పుడు ఉండుంటే బావుండేది

అన్నాడు శివ .

శివా .. రచన .. సత్య విషయం లో కూల్ గా ఉంది అంటే మనం ఆందోళన పడనవసరం లేదని .. నాకు

అనిపిస్తోంది . కానీ అంతు పట్టనిదల్లా వైజయంతి విషయం లో రచన ఎలా కూల్ గా  ఉంది ? మనం ఈ  విషయం

అయితే మాత్రం తెలుసుకోకుండా ఆలస్యం చెయ్యలేం .. అన్నాడు యశ్వంత్ కంగారుగా .



 ఇంకా ఉంది







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 9 July 2014

రుధిర సౌధం 191





ఇప్పుడు చెప్పు .. అసలేం జరిగింది ఆ పాడుబడ్డ కోటలో ... అన్నాడు మెట్ల మీద తీరిగ్గా , ప్రశాంతం గా కూర్చున్న

ప్రేయసి పక్కన కూర్చుంటూ ..

నేనక్కడికి వెళ్లానని తెలియగానే నువ్వు నా కోసం వచ్చావ్ కదూ .. అంది రచన అతడి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ .

ఆమె అలా అడగగానే కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టి .. లేదు .. నీకొసమైతె రాలేదు .. అన్నాడు యశ్వంత్ .

దిగ్గున లేచి .. నాకోసం రాలేదా ? అంది చిన్నబోతున్న మొహం తో ..

అమాయకం గా మొహం పెట్టి తానూ లేచి నిలుచుని .. నాకు నమ్మకం నీ మీద .. నువ్వు సాధించుకు రా గలవని .

అందుకే నేను రాలేదు .. బట్ సరస్వతి ని బాలయ్య వాళ్ళు అటువైపే తీసుకురావడం చూసి ఫాల్లో అయ్యాం అంతే .

అన్నాడు యశ్వంత్ .

అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ? అంది బుంగమూతి పెట్టి రచన ...

ఇప్పుడెందుకు వచ్చిందా అనుమానం ? అన్నాడు కొంటె గా నవ్వుతు యశ్వంత్ .

మరి .. ప్రేమించిన అమ్మాయి అలాంటి చోటికి వెళ్తే ఏమయ్యుంటుందో అన్న టెన్షన్ కూడా లేదా నీకు ? అంది

నిలదీస్తున్నట్లుగా రచన .

హ్ .. అని నిట్టూర్చి .. పాపం .. మా రచన అక్కడికి వెళ్తోంది .. అక్కడ ప్రశాంతం గా ఉన్న దెయ్యాలకి దిక్కూ , గతి

లేకుండా పోతోందే అని భయ పడ్డాను సుమీ .. అన్నాడు యశ్వంత్ తమాషాగా .

నిన్నూ ... అని అతడి ముక్కు మీద ఒక్క పిడి గుద్దు గుద్దింది రచన .

అతడు .. కమాన్ .. వుయ్ విల్ ఫైట్ .. అని చేతులు బిగించి ముందుకి  వచ్చాడు ..

హే .. హే .. ఏం చేస్తున్నార్రా బాబూ .. అంటూ వచ్చాడు శివ .

ఫైటింగ్ అన్నారు .. ఇద్దరూ ఒకేసారి .

ఓహ్ .. అయితే .. తర్వాత .. అని రచన వైపు తిరిగి .. రచనా .. కొంతమంది ఆడవాళ్ళు మహల్ శుభ్రం చేసేందుకు

వచ్చారు .. మగవాళ్ళంతా బయట అంతటా శుభ్రం చేస్తున్నారు .. అన్నాడు శివ .

ఆడవాళ్ళా ? స్ట్రేంజ్ .. నిన్నటి వరకూ ఇటు వైపు రావటానికే భయపడ్డారు .. ఇప్పుడు ఇంత మంది ధైర్యం గా

వస్తున్నారు . ఒక్కసారి గా కాలం ఎంత మాయ చేసిందో .. అంది రచన అబ్బురం గా .

అవును .. ఇలా మహల్ చుట్టూ అందరూ  ధైర్యంగా తిరగాలనేగా నువ్వు తపన పడ్డావు . నువ్వు అనుకున్నది

ఈరోజు జరుగుతుంది రచనా .. అన్నాడు యశ్వంత్ .

అవును యశ్ .. అని శివ వైపు తిరిగి ఇంతకీ వాల్లెక్కడున్నారు ? అంది  రచన .

అటువైపు మండపం మెట్ల మీద .. చాలా  కులాసా గా కూర్చున్నారు . వాళ్ళ మొహాల్లో నిశ్చింత  , ధైర్యం కాన

వస్తుంది . అటువైపు చూడు .. అన్నాడు శివ .

శివ చూపించిన వైపు చూసారు ఇద్దరూ ..

వాళ్లకి పని అప్పచెప్పి వస్తాను అయితే అని రచన కదల బోతుంటే ... రచనా .. ఆగు .. ముందు అన్ని విషయాలు

మనం మాట్లాడుకోవాలి కదా .. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి మా మనస్సులో .. అన్నాడు యశ్ .

ఇంకా ఉంది





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday, 8 July 2014

రుధిర సౌధం 190

స్వామీ ... నది ఒడ్డు కి చేరుతోంది పడవ .. అన్నాడు పడవవాడు .

కళ్ళు మూసుకొని ధ్యానం లో ఉన్న రమనానంద మహర్షి కళ్ళు తెరచి .. ఆ .. అని తన వంకే ఆసక్తిగా చూస్తున్న

గోపాల స్వామి వైపు చూసి .. నీవు ఒడ్డు రాగానే దక్షిణ దిశ గా పయనమై ఆ అడవి లో నేను చెప్పిన వస్తువులని

సేకరించు ... సేకరించిన పిమ్మట తూర్పు దిశగా పయనం సాగించు .. ఒక కుగ్రామం కనబడుతుంది .. ఆ కుగ్రామం

లో నేను నిన్ను కలవగలను . స్నానం ఆచరించి వస్తువులని సేకరించు గోపాలా .. అన్నాడు రమనానంద మహర్షి .

ఏదో మహత్కార్యం లో పాలు పంచుకో బోతున్నానని ఉత్సాహం తో ఉన్న గోపాల స్వామి  సంతోషo  గా తల

ఊపాడు .

పడవ ఒడ్డు కి చేరింది ...


స్వామీ ... మరల మీ దర్శనం ఎప్పుడు స్వామీ అన్నాడు పడవవాడు వినయంగా ...

ముర్రయ్యా ... నా దర్శనం కొరకు కాదు .. ఆ జగదాంబ దర్శనం కొరకు రేపు పౌర్ణమి నాడు రావణ పురం చేరుకో ...

ఇన్నేళ్ళ నీ నిరీక్షణ ఫలిస్తుంది .. అన్నాడు రమనానంద .

మహద్భాగ్యం స్వామీ .. అని మళ్ళి పడవని వెనక్కి మళ్ళించాడు పడవవాడు ..

స్వామీజీ .. ఈ పడవ వాడు మీకు ముందరే తెలుసునా ? మీరు పిలిచి నట్టే మీకొరకు ఆవలి ఒడ్డున ఆహార

పదార్థాల సహితం గా ఎదురు చూస్తూ ఉన్నాడు .. అన్నాడు గోపాల స్వామి .

గోపాలా .. మనసులు  సాన్నిహిత్యం గా ఉన్నప్పుడు దూరం మాత్రం ఏం చేయగలదు . చిరుగాలితో సందేశం

పంపినా  చాలునని నీవు ఎరుగవా ? దీనికే ఆశ్చర్యపడి సమయాన్ని వృధా  చేయకు .. తక్షణమే దక్షిణ దిశ గా

బయలుదేరి రేపు ఉదయాని కల్లా ఆ గ్రామాన్ని చేరుకో నువ్వు .. అన్నాడు రమణానంద .

అలాగే స్వామీ ... అని గురువు పాదాలకి నమస్కరించి దక్షిణానికి పయన మయ్యాడు గోపాల స్వామి .

గోపాలస్వామి అటు అలా వెళ్ళగానే .. నది చుట్టూరా ఉన్న అటవీ మార్గం గుండా నడక సాగించాడు రమణానంద .

                                                     *************************

విక్కీ ఇక్కడ నుండి మనం రోడ్ మార్గం లోనే వెళ్ళాలి అంది గిరిజ .

అవునా అమ్మా ? నేను కాబ్ బుక్ చేసి వస్తాను ... నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో అమ్మా ... అన్నాడు విక్కీ .

అలాగే .. మనం ముప్పావు వంతు ప్రయాణం సులువుగా చేసేసాం నాన్నా .. కానీ ఇక్కడి నుండి వెళ్ళటానికే

ఆలస్య మవుతుంది .. అంది గిరిజ .

ఎంత సమయం పట్టొచ్చు అమ్మా ? అని అడిగాడు విక్కీ .

మనం ఇప్పుడు బయల్దేరితే .. రేపు ఉదయం కల్లా రావణ పురం లో ఉంటాము .. వెంటనే కాబ్ తీసుకొని రా

నాన్న  ... అని పక్కనే ఉన్న బెంచ్ లో కూలబడింది .. గిరిజాదేవి .

కాబ్ కోసం వెళ్తున్న విక్కీ ని చూస్తూ అనుకొంది .. సుమారు 20 ఏళ్ళ తరువాత మళ్ళి రావణ పురం వెళ్తున్నాం ..

ఈ ప్రయాణం మన జీవితాలని ఏ మలుపు తిప్పబోతుందో .. అనుకొంది  మనసులో గిరిజ .



ఇంకా ఉంది






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 7 July 2014

రుధిర సౌధం 189


అలాగే శివా .. కానీ ఊరివాళ్ళు ఏమంటారో .. అన్నాడు యశ్వంత్ .

బాబూ .. మేము ఈరోజు నుండి భూపతిని ఊరి నుండి వేలివేస్తున్నాం .. ఎవ్వరూ మాట్లాడేది లేదు .. సహాయం

చేసేది లేదు .. ఇది మాకు మేము చేసుకున్న తీర్మానం .. అన్నారు ప్రజలంతా ..

ఈ శిక్ష సరిపోతుందో లేదో అతడే నిర్ణయించుకోవాలి యశ్వంత్ .. అని ప్రజల ముందు కి నడిచి .. ఇక నుంచి రాణి

మహల్ వైపు రావటానికి భయపడకండి .. మహల్లో మేము ఉండబోతున్నాం .. రేపు మహల్లో జరగబోయే

వేడుకకి మీరంతా కూడా హాజరవ్వండి .. మహల్ ని శుభ్రం చేసుకుందాం .. మహల్లో ఉన్న అమ్మవారిని

అందరం ఆరాదిద్దాం . ఈ ఊరికి మంచి జరుగుతుంది .. అంది రచన .

ప్రజలంతా ఆనందంగా తలలూపారు ...   

ఇక నుంచి ఈ ఊరికి నాయకులు అంటూ ఎవ్వరు లేరు .. అంతా మనమే .. మనమే మన ఊరికి మంచి చేయాలి ..

బాగుచేసుకుందాం ... తప్పక బాగుచేసుకుందాం .. అంది రచన .

యశ్వంత్ , శివ ఆమె వైపు ఆనందాశ్చర్యాలతో చూస్తున్నారు ..

భూపతి కృంగిపోయాడు ...

భూపతి గారు .. మీరున్న బంగాళా కూడా మహల్ చెందినదే .. త్వరగా ఖాళీ చేయండి .. అంది రచన ..

అతడు నీరసంగా చూసాడు రచన వైపు ..

అమ్మా .. నేను ఇల్లంతా ఖాళీ చేయిస్తాను .. మీరు మహల్ కి వెళ్ళండమ్మా .. అని యశ్వంత్ దగ్గరిగా వచ్చి అయ్యా

నా సంగతి మరవ కండయ్యా .. అన్నాడు బాలయ్య .

బాలయ్య .. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు .. ఈరోజు జనం ముందు నువ్వు నిజాల్ని వెల్లడిన్చావు .. అదే నీకు

శ్రీరామ రక్ష.. నిన్ను ప్రజలు ఏమి అనరు భయపడకు .. తాయెత్తు నేనిస్తాను అన్నాడు యశ్వంత్ .

యశ్వంత్ .. వచ్చిన పని అయిపొయింది .. ఇక మహల్ కి వెళ్దాం .. బోలెడన్ని పనులున్నాయి .. అంది రచన .

అవును .. అని భూపతి వైపు తిరిగి .. ఇకనైనా మనిషి లా బ్రతుకు .. అని ముందుకి కదిలాడు యశ్వంత్ ..

యశ్వంత్ ,శివ , రచన ల వెంట జనం కూడా మహల్ వైపు కదిలారు ..

ఇప్పుడు ప్రజల్లో మహల్ పట్ల భయం తొలగిపోయుంటుంది .. కానీ అక్కడ వైజయంతి ఉండటం నిజం కదా ...

అన్నాడు శివ .. రచన కి మాత్రమె వినబదేటట్టుగా ..

శివా .. వీరస్వామి .. వైజయంతి ని బంధించాడు .. ఇప్పుడు భయం ఏమీ లేదు .. అన్ని విషయాలు మనం తర్వాత

మాట్లాడుకుందాం .. అంది రచన .

అవును శివా .. ఇప్పుడు మాట్లాడొద్దు . ఇప్పుడు వారి మనస్సులో ఎటువంటి అనుమానానికి తావు ఇవ్వొద్దు ..

అన్నాడు యశ్వంత్ ..

అలాగే .. మరి సత్య .. అన్నాడు శివ .

మురారి తనదగ్గరున్నాడు .. సరస్వతి వాళ్ళని చూసుకుంటుంది .. ముందు మనం మహల్ శుభ్రం చేసుకోవాలి

అంది రచన ముందుకి నడుస్తూనే ..

ఇంకా ఉంది 





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Saturday, 5 July 2014

రుధిర సౌధం 188


జనం లో కలకలం మొదలయ్యింది ..

ఓరి దుర్మార్గుల్లారా ... ఊరోలన్దర్నీ పొట్టన పెట్టేసుకున్నారు కదరా .. మీరు చెప్పిన దానికల్లా తల ఆడించాము

కదరా .. ఇంత అన్నాయం చేస్తారా మాకు ? అంటూ చేతి కందిన రాయి తీసుకొని భూపతి మీదకి , బాలయ్య ,

శంకరం మీదకి విసిరారు .

భూపతి శరీరం రక్తసిక్త మయ్యింది ..

ఆగండి .. ఆగండి .. ఏం చేస్తున్నారు మీరు ?అంటూ భూపతి కి అడ్డం గా వెళ్ళింది రచన .

ప్రజలు రాళ్ళు రువ్వటం మెల్లిగా ఆపారు ...

ఎందుకీ ఆవేశం ? మోసం చేసేవాడి కన్నా , మోసం చేయించుకున్న వాడిదే తప్పు .. మీరు యితడు చెప్పిందల్లా

గుడ్డిగా చేశారు .. ఇతడి బలాన్ని మీరే పెంచారు .. మీ పిల్లల్ని చదివించవద్దు అంటే చదివించటం మానేశారు ..

మన ఊరికి రోడ్స్ వద్దంటే మీరు వద్దనుకున్నారు .. మీ ఊరి ప్రగతిని మీరే అడ్డుకున్నారు .. మీ జీవితాలని మీరే

తాకట్టు పెట్టేసారు .. మరి తప్పు అతనిది ఎలా అవుతుంది ..? మీ సమాధుల పైన అతడు తన సింహాసనాన్ని \\

ఏర్పాటు చేసుకుంటుంటే నిశ్శబ్దం గా చూసారు .. అంతే గానీ ఆలోచించలేదు .. ఆలోచించాలని , ఎదురించాలని

మీకు తలంపు కూడా రాలేదు .. ఇప్పుడు శిక్షించేందుకు అధికారం మాత్రం వచ్చిందా ? అన్నాడు యశ్వంత్ .

అయ్యా .. ఏం చేయమంటారు ? మమ్మల్ని పట్టించుకొనే నాథుడే లేదాయే .. జరిగుతున్నది అన్నయమో ధర్మమో

తెలుసుకోలేని వాళ్ళం బాబూ .. మంచికి చెడ్డకి .. ఇదుగో ఈ పెద్దోల్ల ముందు తలోంచటం .. కష్టానికి పతిఫలం

వచ్చిన .. రాకున్న పొట్టలో ముంగాలు బెట్టి తొంగోటం తప్ప మరోటి తెలవదయ్యా .. అన్నాడు ఓ  ముసలి వాడు .

తాతా ... బాధ పడకండి .. ఇప్పుడు మీకు మేమున్నాం .. ఈ ఊరికి రోడ్లు వస్తాయి .. అన్ని సదుపాయాలు వస్తాయి
అన్నింటి మీద మీకు హక్కుంది .. మీ భూములు భూపతి అక్రమం గా  ఆక్రమించు కున్నాడు .. మీ భూములు

మీకు దక్కేలా మేము చేస్తాం .. అంది రచన ప్రజల నుద్దేశించి .

ఆ పైవోడు గొప్పోడు .. తల్లే .. తాను రాలేక మిమ్మల్ని పంపాడేమో.. ఏ బంధం లేక పోయినా ఈ ఊరికి మంచి

చేస్తున్నారు .. అన్నాడు ఆ ముసలాయన .

బంధం ఉంది తాతా .. నేను ఈ ఊరి బిడ్డనే .. ఆ మహల్ మా కుటుంబానిదే .. ఏ మహల్ మీ మనస్సులో భయాలని

కలగజేస్తుందో .. ఆ భయాన్ని మీనుండి దూరం చేద్దామని వచ్చాను .. ఇక ఈ ఊరి  బాగోగులు చూసే బాధ్యత

మాదే .. అంది రచన స్థిర చిత్తం తో ..

భూపతి రచన వైపు విస్తుపోయి చూస్తుంటే .. జనం హర్ష ధ్వానాలు చేస్తుంటే .. యశ్వంత్ , శివ , సరస్వతి ,తాత

రచన వైపు చిరునవ్వుతో చూశారు ..

అమ్మా .. మా ఊరు నిన్ను చూసి గర్వం తో తలెత్తుకుంటుంది .. ఈ సంతోషం తో పండగ చేసుకోవాలమ్మా ..

అన్నారు జనం .

 అవును పండగే చేసుకోవాలి .. ఈరోజు చతుర్దశి .. ఈ  రాక్షసుడు మన ముందు పతనమయిన రోజు .. రేపు

పౌర్ణమి .. పండగ  చేసుకుందాం .. ఆ చంద్రుడి వెలుగు సంతోషం తో వెలగబోయే మన మొహాల ముందు

చిన్నబోవాలి .. అంది సరస్వతి .

కానీ భూపతిని ఇలాగే వదిలేస్తామా ? ఇన్ని పాపాలు చేసినా ... పోలిసుల కి అప్పజెపుదాం యశ్వంత్ అన్నాడు ..

శివ .

ఇంకా ఉంది 


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 4 July 2014

రుధిర సౌధం 187




నిజమే .. మీరు నమ్మలేరు .. ఎందుకంటే భూపతి మేక వన్నె పులి ... మీరంతా అమాయకులు  అందుకే

ఇన్నాళ్ళు అతడి ఆటలు సాగాయి ... రాముడ్ని హత్య చేయించాడు .. అందుకు బలమైన సాక్ష్యం ఉంది మా దగ్గర .

అన్నాడు యశ్వంత్ .

ఏమిటది ? ఆవేదన నిండిన స్వరం తో అన్నారు రావణ పురం ప్రజలు ...

ఆ సాక్ష్యం ఏదో చెప్పే ముందు .. మరిన్ని విషయాలు చెప్పాలి .. పరిశోధన కోసం వచ్చిన పోలీస్ ఆఫీసర్ ని కూడా

భూపతే మట్టు బెట్టాడు .. అలాగే ఈ ఊరిలో తనకి అడ్డం అనుకున్నవాళ్ళు అందర్నీ చంపించాడు .. కానీ నేరం

మాత్రం రాణి మహాల్లోని పిశాచం మీదకి నెట్టాడు . బహుసా ఈ విషయం ఆ పిశాచానికి తెలిసుండి ఉంటే ముందర

భూపతి నే అంత మొన్దిన్చేదేమో ... అన్నాడు శివ .

చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు మీరు .. మితి మీరకoడి.. అన్నాడు ఆవేశం తో వణికి పోతూ భూపతి ..

అంత  ఆవేశ పడకండి .. భూపతి గారూ .. చెడ్డవాడు ఎన్ని విజయాలైనా పొంది ఉండొచ్చు .. కానీ ఆఖరికి మాత్రం

అతడు పొందే ఓటమి ఎలా ఉంటుందంటే .. అది అతడి విజయాలన్నీ తుడిచి పెట్టేయటమే కాదు .. అతడ్ని

సమూలం గా నాశనం చేస్తుంది .. అంది రచన భూపతి వైపు తీక్షణం గా చూస్తూ ..

నిజమే .. అదే ఇప్పుడు జరగబోతుంది .. రావణ పురం ప్రజలారా ? మామాటలు నిజమని ఓ గొంతు పలక

డానికి సిద్ధం గా ఉంది . ఏ కళ్ళు అయితే భూపతి ప్రతీ పాపానికి ప్రత్యక్ష సాక్షో .. ఏ పాదాలు భూపతి వెంట పాపపు

పంకిలం వైపు సాగాయో .. ఆ పాదాలు ఇప్పుడు రావణ పురం లో ఉన్న రావణా సురుని భాగోతాన్ని

వివరించడానికి మన ముందుకి రాబోతున్నాయి ... అని భూపతి వైపు చూసాడు యశ్వంత్ .

అతడిలో సన్నగా వణుకు మొదలైంది ..

యశ్వంత్ భూపతి వెనుక ఉన్న బాలయ్య వైపు చూసి కనుసైగ చేశాడు ...

అతడు మెల్లిగా ముందుకి వచ్చి భూపతి వైపు చూసి జనం ముందుకి నడిచాడు ...

బాలయ్యా ... సాక్ష్యం చెప్పేది ... మనసులోనే బాధగా మూలిగాడు భూపతి .

మీ అందరికి ముందర క్షమాపణ చెప్పాలె ... నిజం చెబితే మనస్సాంతి ఉంటాది .. నా పెళ్ళాం , బిడ్డలకి మంచి

బతుకు ఉంటాది ... మీ అందరికి తెలుసు .. నేను భూపతి కాడా ఎన్నాళ్ళ నుండి పనిచేస్తున్నానో .. ఈ ఊరిలో

నన్ను సూసి భయపడే వోళ్ళే ఎక్కువ .. నాకది తెల్సు .. మనం అందరం భయపడాల్సింది ఆ పైవోడికే ... అని

గట్టిగా ఊపిరి పీల్చుకొని ... ఆ బాబు చెప్పింది నిజం .. ఈ సరస్వతి ని బంధించమని భూపతే సెప్పిండు .. నేను

మరికొందరం బంధించినాం .. వాళ్ళు మీలోనే ఉన్నారు .. బయటకి రండిరా .. అన్నాడు బాలయ్య .

జనం లోంచి ఆ ఇద్దరు ముందుకొచ్చి తల ఒంచుకొని నిలబడ్డారు ..

భూపతి  నిల్చున్న చోటే కూలబడ్డాడు ...

మేమే సరస్వతిని బంధించింది .. ఆ నేరం ఈళ్ల మీద నేట్టేసాం .. రాముడిని చేతబడి చేయించి చంపినం .. వాడు

భూపతి దారికి అడ్డం పడినాడని .. పోలిసోడ్ని .. మన ఊరి ఈరిగాడ్ని .. బలరామయ్య ని ఇలానే మరికొంత మంది

అందర్నీ భూపతి అడ్డు తొలగించుకున్నాడు .. ఈ ఊరికి రాజు తానె కావాలని .. ఊరోళ్ళకి బయట పపంచకం తేలీ

కూడదని .. ఊరి బాగు కోసం ఆలోచించి నొలు అందర్నీ అడ్డు తొలగించేసుకున్నాం .. ఈటన్నిటికీ నేనే సాక్ష్యం ..

ఆ పాపాలలో సగం మూట కట్టుకొన్నది నేనే .. అన్నాడు కన్నీళ్ళ పర్యంత మవుతూ బాలయ్య .

ఇంకా ఉంది 









మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

అనుకోని అతిథి



నే తలవని తలపువో .. మది పిలవని పిలుపుపో ..

ఎద గూటికి అతిథి వో .. అనుకోని అతిథి వో ..

ఎదురే చూడని కనులకు ఎదురుగా వచ్చావు ..

ఎదరున్నది ఎడారి కాదాని వాసంతం చూపావు ..

కమ్మని భాష్యం చెప్పావు చెలిమి చలువలోనా

రమ్మని గమ్యం పిలిచేలా నా దారిని మల్లించావు ..

నువ్వు ఎవ్వరో .. తెలియదు .. ఊరు పేరు తెలియదు ..

మనసు ముత్యమని తెలుసు .. నీ నవ్వు వెన్నెలని తెలుసు ..

మరపురాని జ్ఞాపకాలకి ఆలవాలమని తెలుసు ..

కరిగిపోయినా కాలం .. తిరిగిరానిదే .. కానీ ..

ఉండిపోయానే నీకై ఆ చోటనే .. నేనిను కలసిన చోటనే ..

మరిగిపోవు నా మనసుని .. ఆపలేనుగాని ..

శిలను కానులే చెలి..  ఉలి తాకిన శిల్పాన్నే ...

నీ తీయని ఊహల లోకం లో జాగృతమైనది నా కల ..

నా తీరని మోహపు మైకంలో మమేకం అయినది చెలి అలా ..

ఎన్నాళ్ళు గడచినా నను వీడిపోదే .. ఎన్నేళ్ళు వేచినా చెలి జాడ లేదే ..

మది కడలి నే మధియించిన ఎడబాటు విషమేలే .. నీ ప్రేమ అమృత మవులె ...

రాకోయి అనుకోని అతిథీ .. మరల మరల నన్ను మధించ నీ తరమా ...
  



మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 3 July 2014

రుధిర సౌధం 186



అవును ... మీ అందరికి నమ్మశక్యం గా లేదా ? కానీ భూపతి గారికి మాత్రం చాలా షాకింగ్ గా ఉంది ... అవునా ?

భూపతి గారూ ... ? అంది రచన .. అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ ..

భూపతి కి ఓ క్షణం ఏమి జరుగుతుందో అర్థం కాలేదు .. కానీ మెల్లిగా తేరుకొని .. అమ్మాయ్ సరస్వతీ ..

ఏమయిపోయావ్ ? ఎలా ఉన్నావు ? నీకేం జరగలేదు కదా .. అన్నాడు భూపతి సరస్వతి వైపు చూస్తూ ..

చాలు .. భూపతి గారూ .. ఇంకా మీకు అర్థం కాలేదా ? మీ పతనం దగ్గర పడిందని .. మీరే కదా నన్ను బంధించింది .

నన్ను మీరే బంధించి .. ఆ నేరాన్ని ఈ పట్నం వాళ్ళ మీద వేసేసి .. అటు నా అడ్డు .. ఇటు వీళ్ళ అడ్డు తొలగించు

కోవాలనుకున్నారు .. అంది సరస్వతి .

ఏం మాట్లాడుతున్నావు నువ్వు ? నీ బుర్ర సరిగ్గా పని చేస్తుందా ? గద్దించి ఉరిమి చూశాడు .. భూపతి .

అవును ..ఈ ఊరిజనం ముందు నేను అంతా నిజమే చెబుతున్నాను .. నీ పాపం పండిపోయింది భూపతీ .. అని

జనం వైపు చూసి ... ఇంకా ఎన్నాళ్ళు భరిస్తారు ఈ బానిసత్వం ? మీ అందరికి తెలుసు మనకి అన్నాయం జరుగు

తోందని ... కానీ .. భయం .. భయం .. మిమ్మల్ని మాటాడ నివ్వదు .. మీ ఊరి ఆడ కూతురికి అన్నాయం జరిగింది

అని తెలియగానే మీరంతా ఈ పట్నం వోళ్ళని వేలివేసేసారే .. కానీ అన్నాయం చేసింది ఈ భూపతి .. ఇప్పుడు

ఎవ్వరూ మాటాడరేం? ఆవేశం గా ప్రశ్నించింది సరస్వతి ..

నిజంగా నిన్ను భూపతి గారే బంధించారా ? అన్నాడు జనం లోంచి ఒకడు ..

లేదు .. నేను కాదు .. నాకిప్పుడు అర్థం అయింది .. ఇదంతా నన్ను మీ అందరి ముందు చెడు చేయటానికి ఈ

పట్నం వొళ్ళు ఆడిన నాటకం ఇదంతా .. ఈ సరస్వతి కూడా వాళ్ళతో కుమ్మక్కై ఈ నాటకం ఆడుతోంది .. అన్నాడు

భూపతి ఆందోళన గా ..

వహ్ .. చాలా .. చాలా బావుంది భూపతి .. నువ్వైతే ఇలానే స్పందిస్తావనుకొన్నా .. మార్పెం లేదు .. అని జనం

వైపు తిరిగి .. బహుశా మీలో కూడా ఇలాంటి అనుమానాలే ఉండి ఉండొచ్చు .. వినండి .. మీరు నమ్మలేని మరిన్ని

నిజాలు ఉన్నాయి .. విషయం ఏమిటంటే అవన్నీ కూడా భూపతి పాపపు చిట్టాలే .. అన్నాడు యశ్వంత్ .

జనం అంతా ఆసక్తిగా చూశారు యశ్వంత్ వైపు ..

కొన్ని రోజుల ముందు చని పోయిన రాముడి చావు మీ అందరికి గుర్తు ఉండే ఉంటుంది .. కానీ అది మహల్లో ని

దెయ్యం పని అనుకున్నారు .. అంతేనా ? అని అరిచాడు యశ్వంత్ గట్టిగా ..

అవును .. అయితే ఏం ? అన్నాడు జనం లో ఒకడు ..

కాదు .. రాముడ్ని చంపింది .. మహాల్లోని దెయ్యం కాదు .. మీ ఊరికి దేవుడనుకుంటున్న ఈ రాక్షసుడు భూపతి .

అన్నాడు యశ్వంత్ .

యశ్వంత్ .. మనం ఈ ఊరి వాళ్ళం కాదు .. మనం చెబితే ఏం నమ్ముతారు ? వీళ్ళ ఊరివాడు చెబితేనే నమ్ముతారు

అన్నాడు శివ .

మేము నమ్మలేం ... ఎలా ఇలా అనగలుగుతున్నారు మీరు ? విస్తు పోయి అన్నాడు ఓ ముదుసలి జనం లోంచి  ..

ఇంకా ఉంది



మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 2 July 2014

రుధిర సౌధం 185


ఏంటి ? మళ్ళి మమ్మల్ని అందర్నీ భూపతి ఇంటి ముందుకి రమ్మన్నావు ? ఏంటి విషయం ? అడిగాడు భూపతి

ఇంటి ముందర నిలబడ్డ  జనం లోంచి ఒకడు .

కొద్దిసేపు ఓపిక పట్టన్డయ్యా .. కళ్ళ ముందు కమ్మిన మబ్బులు  విడిపోతాయి .. అన్నాడు తాత .

ఏమిటయ్యా  ...  అందరూ ఇలా కట్ట కట్టుకొని మరీ వచ్చారు ? భూపతి గారితో ఏం మాట్లాడాలని ? అన్నాడు

అప్పుడే ఇంటి నుండి బయటికి వచ్చిన గుమస్తా శంకరం ...

నేనే రమ్మన్నాను శంకరం గారూ .. అన్నాడు యశ్వంత్ అక్కడికి చేరుకుంటూనే ...

శంకరం తో పాటూ  జనం కూడా ఆశ్చర్యంగా చూసారు యశ్వంత్ వైపు .. శివ వైపు ..

నువ్వా ? ఎంత ధైర్యం మిమ్మల్ని ఊరినుంచి వేలివేసాం ... మర్చిపోయారా ? అన్నాడు శంకరం కళ్ళద్దాలను సరి

చేసుకుంటూ ..

మర్చిపోలేదు శంకరం గారూ .. అందుకే వచ్చాం .. ముందు ఈ ఊరి దేవుడిని .. అదే మీ భూపతి గార్ని ఓసారి

పిలవండి ... అన్నాడు శివ వెటకారంగా ..

పిలుస్తాం .. ఎందుకు పిలవం ? అని లోపలికి వెళ్ళాడు శంకరం ..

ఏంటయ్యా ? మళ్ళి ఈ పంచాయితీ   ... మిమ్మల్ని ఊరినుండి పంపేసాం .. మళ్ళి మళ్ళి ఇలా మీరు ఊరిలోకి

వస్తే ఎలా ? అన్నాడు ఓ పెద్దమనిషి జనం లోంచి .

నిజమే .. కానీ మేము నేరం చేశామని ఒప్పుకోలేదు కదా ... మామీద ఓ నింద ని మోపారు .. అది నిజమా కాదా

అన్నది మీకు తెలియాలి కదా .. భూపతి ని రానివ్వండి .. అన్ని మీకే తెలుస్తాయి .. అన్నాడు యశ్వంత్ .

అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ..

ఇంతలో లోపలికి వెళ్ళిన శంకరం ... అయ్యా .. మీరోసారి బయటకి రావాలయ్యా .. అన్నాడు భూపతిని .

ఏం శంకరం ? బయట ఏదో కోలాహలం గా ఉంది ఏం జరిగింది ? అన్నాడు భూపతి .

ఆ పట్నం వాళ్ళు వచ్చారయ్య .. మిమ్మల్ని పిలుస్తున్నారు ... అన్నాడు శంకరం నసిగినట్టుగా ..

వాళ్ళా ? ఎందుకు వచ్చారు ? పద .. వెధవల్ని కడిగిపాడేస్తాను ... అని బయటకి నడిచిన భూపతి ఇంటి ముందు

గుమిగూడిన జనాన్ని చూసి హతాసుడైనాడు ...

వెల్కమ్ భూపతి గారూ .. మీకోసమే వేచి చూస్తున్నాం .. అన్నాడు యశ్వంత్ చిరునవ్వుతో ...

ఏమిటిది ? అసలు మీరెందుకు వచ్చారు ఇక్కడికి ? గద్దించి నట్టు అన్నాడు భూపతి ..

నిన్న మీరు మాకు సర్ ప్రైస్ చేశారు .. ఈరోజు మేము మీకు చేస్తున్నాం .. అంతకి మించి ఏం లేదు భూపతీ ..

అన్నాడు శివ .

ఓయ్ .. మర్యాద .. మర్యాదగా మాట్లాడు .. నువ్వు మా ఊరిలో నిలబడి  మాట్లాడు  తున్నావు అది మర్చి పోకు ..

అన్నాడు  భూపతి కోపంగా .

నిజమే .. మర్యాద ఇచ్చిపుచ్చు కోవాలి ... కానీ ఈ సూత్రం నీలాంటి మేక వన్నె పులుల దగ్గర వర్తించదు  భూపతీ ..

అయినా ఆలస్యం చేయకూడదు .. నీ భండారం బయట పెట్టడానికి ... ఎందుకంటే ఇక్కడి వచ్చిన ప్రజలు వాళ్ళ

పనులు మానుకొని వచ్చారు గా ... అన్నాడు యశ్వంత్ .

ఏం మాట్లాడుతున్నారు ? మీరు బయట పెట్టడానికి ఏముందని ? అన్నాడు భూపతి ... కోపంగా

ఉంది భూపతీ .. సరస్వతి .. సరస్వతి కనిపించడం లేదనేగా .. మామీద నింద మోపావు .. ఆ సరస్వతి ని నువ్వే

కిడ్నాప్ చేసావు .. అది నిజం .. ఒప్పుకోక తప్పదు .. అన్నాడు శివ .

పిచ్చి పట్టిందా మీకు ? నేనెందుకు సరస్వతి ని ఇబ్బంది పెడతాను ? మీ పిచ్చి వాగుడిని మా జనం నమ్మరు ..

అన్నాడు భూపతి ..

ఎందుకు నమ్మరు ? నువ్వు చూపించిన సాక్ష్యాలను నమ్మిన ఈ ప్రజలు .. నిజాలని నమ్మరా ? నమ్ముతారు ..

అన్నాడు యశ్వంత్ .

భూపతి గార్ని అంటారేంటి ? ఆయన్ని అలా అనడానికి మీ దగ్గరేం సాక్ష్యం ఉంది ? అన్నాడు జనం లోంచి ఒకడు .

సరస్వతి ... సరస్వతే .. ఉంది .. సాక్ష్యం గా ... అన్న మాటలు విని అందరూ తల పక్కకి తిప్పి చూశారు ..

అక్కడ రచన , సరస్వతి ఇద్దరూ నిలబడి ఉన్నారు ..

అరె .. మన సరస్వతే .. అని జనం అనుకుంటే .. సరస్వతి ని చూసి ...   హతాశుడయ్యాడు భూపతి .

ఇంకా ఉంది   





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Sunday, 29 June 2014

రుధిర సౌధం 184

                                                             రుధిర సౌధం  

గురువుగారూ ... ఇంకా ఎంత సేపు మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది ? అడిగాడు గోపాలస్వామి

ముకుళిత వదనం తో అతడి వైపు చూసి .. ఏమి నాయనా ? కాళ్ళు నొప్పి పెడుతున్నాయా ? అన్నారు

రమనానంద మహర్షి .

అయ్యో .. లేదు స్వామీజీ  ... మీరు అవిశ్రాంతం గా నడక సాగిస్తూనే ఉన్నారు ... మీరు కొంచెం విశ్రమిస్తే బావుండు

నని ... అన్నాడు గోపాలస్వామి ..

దగ్గరలోనే ఓ నది ఉంది ... ఒక బోయవాడు మనకోసమే ఎదురుచూస్తూ ఉంటాడు .. అతనిని పడవని సిద్ధం

చేయమని చెప్పు గోపాలస్వామి . నేనింతలోపు అక్కడికి చేరుకుంటాను .. నువ్వు వడివడిగా అక్కడకి వెళ్ళు ..

అన్నారు మహర్షి .

తమరి ఆజ్ఞ .. అని గోపాలస్వామి పక్షుల కిలకిలారావాల ననుసరించి అటుగా సాగిపోయాడు ...

తిరిగి నడక నారంభించాడు రమనానంద మహర్షి .

                                            ********************************

ధాత్రమ్మా .. నేను సిద్ధం గా ఉన్నాను .. కానీ నేను , తాత , మీరు ముగ్గురం అక్కడికి వెళ్ళిపోతే సత్యమ్మ ని

ఎవరు చూసుకుంటారు ? అంది సరస్వతి .

రచన సమాధానం చెప్పబోయే లోపే తలుపు కొట్టిన చప్పుడు వినిపించి ... పద .. తలుపు తీద్దాం .. అంది రచన

సరస్వతి వెళ్లి తలుపు తీసింది ... ఎదురుగా మురారి .

బాబూ మీరా ? అంది సంతోషం గా సరస్వతి ...

మురారీ ... అంది రచన .

రచనా .. అంటూ వచ్చి ఆమె చేయి పట్టుకొని .. నిన్ను మళ్ళి నేను   చూడగలుగుతున్నాను .. ఐ అమ్ వేరి

హ్యాపీ .. అన్నాడు మురారి ..

రచన ... ధాత్రమ్మ పేరు రచనా ? అంది ఆశ్చర్యంగా సరస్వతి ...

రచన చిన్నగా నవ్వి మురారీ .. సంతోషం లో సరస్వతి నా పేరు చెప్పేసావా ? అని సరస్వతి వైపు తిరిగి ..

నువ్వు నన్ను ధాత్రమ్మా .. అని పిలువు సరస్వతీ .. అందులో ఏదో తెలియని ఆత్మీయత ఉంది .. అంది రచన .

సరస్వతి ఆమె వంక నవ్వుతూ చూసింది ..

రా రా ... మురారీ .. సత్య ని నీకు అప్పజెబుతా నన్నాను గా .. తను లోపల నిద్రపోతోంది .. అంది రచన .

ఆమె తో పాటు ఆత్రుత గా ముందుకి నడిచాడు మురారి .

మంచం మీద జీవచ్చవం లా పడున్న సత్యని చూసి అమాంతంగా ముందుకి పరుగుతీసి ఆమె దగ్గరకి చేరాడు ..

సత్యా .. సత్యా .. చూడు .. నీ మురారి ని వచ్చాను .. అన్నాడు సుడులు తిరుగుతున్న కన్నీటిని అణచుకుంటూ .

మురారీ .. సత్య మామూలు మనిషి కావటానికి మనందరి ప్రేమా తనకవసరం .. అంది రచన .

చిన్నగా తల ఊపి .. అవును .. అని .... రచనా...  యశ్వంత్ ,శివ భూపతి ఇంటి వైపు వెళ్ళారు .. నేను సత్యని

చూసుకుంటాను .. నువ్వు , సరస్వతి వెళ్ళిరండి .. అన్నాడు మురారి .

 ఇంకా ఉంది 





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Saturday, 28 June 2014

రుధిర సౌధం 183


ఆమె తడబాటుగా నేల చూపులు చూస్తుండటం అతనిలో అనుమానం మొలకెత్తింది ....

అమ్మా ... చెప్పమ్మా ? నా దగ్గర నువ్వు దాస్తున్న ఆ నిజం ఏమిటో ? చెప్పమ్మా ... అని గిరిజ భుజాలను

కుదిపేస్తు అన్నాడు విక్కీ .

విక్కీ .. విక్కీ ..   నన్ను అర్థం చేసుకో ... నాన్నా .. అంది గిరిజ .

అమ్మా ... చెప్పమ్మా ... ఎప్పుడు లేనిది స్వామీజీ ఆశ్రమం దాటారు ? దీనర్థం ఏంటి ? చెల్లి ఎక్కడుంది చెప్పమ్మా ?

నిన్నే .. అడుగుతున్నది చెప్పమ్మా ? అసహనం గా గట్టిగా అరిచాడు విక్కీ ..

విక్కీ .. రచన నా దగ్గర మాట తీసుకుంది .. నీకు చెప్పకూడదని .. ఏం చేయను ? అది నా కళ్ళ ముందే ఉండాలని

నేను కోరుకుంటాను కానీ .. నా మాట ఎవ్వరు వింటారు / ?నీ హక్కు నీకు దక్కాలని .. ఆ ఊరికి మునుపటి కళ

రావాలని .. మీ నాన్న గారి కోరిక .. దాని మనసులో చిన్ననాటి నుండీ అదే ఉంది .. కానీ నా భయం .. దానికి

రావనపురం ఎక్కడ ఉందొ .. ఈ కుటుంబం మూలాలు  ఎక్కడ ఉన్నాయో చెప్పనీయలేదు .. అది ఎదుగుతుంటే

అందరి ఆడపిల్లాల్లానే ఎదుగుతుంది అనుకున్నాను .. కానీ తన తండ్రి కోరిక ని మనసులో దాచుకుని ప్రతీ

అడుగు అటువైపే వేస్తుందని అనుకోలేదు ... అది ఇప్పుడు రావణ పురం లో ఉంది .. విక్కీ .. నేను తనని ఆపాలని

ఎంతగానో అనుకున్నాను .. కానీ నీ చెల్లెలు నా మాట వింటుందా ? అంది ఆవేశంగా గిరిజ .

ఎందుకమ్మా ?... ఎందుకమ్మా మనకా మహల్ ? మన కుటుంబాన్ని అంతటిని పొట్టన పెట్టుకున్న ఆ దెయ్యాల

కోట మీద రచన కి అంత మక్కువ ఎందుకు ? ఇప్పటికి పోయిన ప్రాణాలు చాలవా ?  చాలా చాలా  నష్ట పోయాం ..

ఇంకా చాలమ్మా .. ఇప్పుడు నా ముద్దుల చెల్లెల్ని కోల్పోలేను .. అమ్మా .. రచన అక్కడ ఎలా ఉందో .. నేనింక

క్షణం కూడా ఆలస్యం చేయలేను .. వెంటనే బయల్దేరు అమ్మా .. వెంటనే ... అని కాసేపు ఆగి ..

మనం వెళ్లి రచన ని తీసుకొద్దాం అమ్మా .. నేనోద్దన్నానని నాతొ చెప్పకుండా దాచింది .. అసలెందుకు

వద్దన్నానమ్మా ? అమ్మ ని నాన్న ని , నాన్న లా  పెంచిన బాబాయి ని పోగొట్టుకున్నాం కదా .. ఆ పిచ్చి దానికి

ఎలా అర్థమవుతుంది ? ఈ అన్న కి ఆస్తి అక్కర్లేదని .. అమ్మ లా పెంచిన పిన్నమ్మ , చెల్లెలు ఉంటె చాలని ..

చెప్పమ్మా .. ఎలా అర్థం అవుతుంది ? ఆవేదనగా అన్నాడు విక్కీ ...

అతణ్ణి ఆత్మీయంగా , కన్నీళ్ళతో హత్తుకుంది గిరిజ ..

ఒరేయ్ నాన్నా .. గతాన్ని గుర్తుచేసుకోకు .. అది బాదే మిగిల్చి ఉండి ఉండొచ్చు .. కానీ ప్రతీసారి బాధే ఉండదు

నాన్నా .. నేను చెల్లి మాటల్లో ఆత్మవిశ్వాసాన్ని చూసాను .. ఏమో ఏం జరగబోతుందో ? యశ్వంత్ కూడా తనతోనే

ఉన్నాడు .. నువ్వు వెళ్దామంటే .. వెళ్దాం నాన్నా .. ఇప్పుడే బయల్దేరతాను .. అంది గిరిజ .

అలాగే అమ్మా .. మనం వెంటనే బయల్దేరదాం ... ఏం జరిగినా దాన్ని మనమూ స్వీకరిద్దాం .. నువ్వు వెంటనే రెడీ

అయి రామ్మా .. అన్నాడు విక్కీ .

అలాగే నాన్నా .. అని మేడ మెట్లు వైపు నడిచింది గిరిజ .

హాల్లో ఉన్న వర్ధన వర్మ ఫోటో కేసి కన్నీళ్ళతో చూశాడు విక్కీ ... అతడికి చిన్ననాడు తను తండ్రి ఒడిలో తను

చిందించిన చిరునవ్వులు జ్ఞాపక మోచ్చాయి ..

నాన్నా ... నువ్వు నాకు తండ్రివి కాకపోయినా తండ్రిని మించిన ప్రేమ అందించావు .. నీకు నేను ఏమిచ్చి ఋణం

తీర్చగలను ... రచన ని కంటికి రెప్పలా కాపాడటం తప్ప .. అనుకున్నాడు విక్కి మనసులో

ఇంకా ఉంది





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 27 June 2014

రుధిర సౌధం 182



గుడ్ మార్నింగ్ అమ్మా ... అంటూ వచ్చాడు విక్కీ .

డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ సిద్ధం చేస్తున్న గిరిజ వెనక్కి తిరిగి .. గుడ్ మార్నింగ్ నాన్నా .. అప్పుడే లేచావా ?

ఇంత పొద్దున్నే ... కాసేపు నిద్రపోలేక పోయావా ? అంది ఆత్మీయంగా ..

అమ్మా .. ప్రపంచం నిద్రలేచి చాలా సమయమే దాటి పోయింది .. నువ్వేంటంటే నన్నింకా నిద్రపోమ్మంటావు ...

అయినా బోర్ కొడుతుందమ్మా ? రచన  లేకుండా ఇల్లంతా ఎంత సైలెంట్ గా ఉందొ చూడూ ... పోనీ కనీసం

యశ్వంత్ నన్నా కలుద్దాం అంటే యశ్వంత్ ఫోన్ కూడా ఆఫ్ చేసి ఉంది .. ఎక్కడకి వెల్లారమ్మ వీళ్ళిద్దరూ మరీ

అంతలా ఫోన్ ఆఫ్ చేసుకుని  ... అన్నాడు చిరాగ్గా విక్కీ .

వాళ్ళ వృత్తే అది కదా నాన్నా ... ఐన ముందు నువ్వు టిఫిన్ చెయ్ .. అంది గిరిజ .

డైనింగ్ టేబుల్ ముందు కుర్చుని .. పెట్టమ్మా .. నీ చేతి వంట తిని చాలా కాలం అయింది .. అన్నాడు విక్కీ ..

ప్రేమగా అతడికి వడ్డించింది గిరిజ ...

ఆహా .. అమ్మ చేతి వంట .. అమృతమే కదమ్మా ... పిజ్జాలు ,బర్గర్ లు తిని నోరు చచ్చిపోయిందమ్మా ... ఇప్పుడు

ఇలా మన సాంప్రదాయ వంటలు తింటూ ఉంటె ప్రాణం లేచి వస్తుంది అన్నాడు విక్కీ ..

నాన్నా .. నువ్వు ఇండియా లో ఉన్నంత కాలం .. నీకు నచ్చిన వన్ని వండిపెడతా .. సరేనా ? అంది గిరిజ ..

లేదమ్మా .. నేనీసారి ఒంటరిగా వేల్లాలనుకోవటం లేదు ... రచన కి మంచి సంభంధం చూడమ్మా ?   ఈ పరిశోధన

లు  అవీ ఇవీ అని దాన్ని తిరగటం మానేయమను . దాని పెళ్లి అయిపోతే నిన్ను నేను అమెరికా పట్టుకుని వెళ్లి

పోతాను .. అన్నాడు విక్కీ .

లేదు విక్కీ .. నేను అమెరికా కి రాను .. మన వంశీకులు అంతా ఈ నేల లోనే కలసిపోయారు .. నేను కూడా ..

అలానే ఈ దేశపు మట్టిలోనే కలసి పోవాలని అనుకుంటున్నాను .. నన్ను అక్కడికి తీసుకుపోవాలనే ఆలోచన

మానేసుకో .. అంది గిరిజ .

టిఫిన్ ముగించి ... ఒకవేళ ఇదే నీ ఆఖరి నిర్ణయమైతే నేనే ఇక్కడ ఉండిపోతానమ్మ .. నిన్ను ,చెల్లి ని  వదిలేసి

అక్కడ ఉండి నేనేం సాధిస్తాను ? అన్నాడు విక్కీ .

విక్కీ .. ఇప్పుడు ఈ విషయం కోసం చర్చ ఎందుకు ? వదిలేయ్ .. అంది గిరిజ .

సరే అమ్మ .. అని నాప్కిన్ తో చేతులు తుడుచుకుంటూ ... అమ్మా .. నేను స్వామీజీ ని కలసి వస్తాను .. నేను

వచ్చానని  తెలిస్తే ఆయన ఎంతో సంతోషిస్తారుగా .. అన్నాడు విక్కీ ..

గిరిజ మనసులో ఆ మాట వినగానే కలవరం మొదలైంది ... లేదు విక్కీ .. స్వామీజీ ఊరిలో లేరు .. నువ్వక్కడికి

వెళ్ళినా ఏ ప్రయోజనం ఉండదు .. అంది కంగారుగా ..

ఏంటీ ... ? ఏంటమ్మ .. నువ్వు అంటుంది ? నాకు ఊహ తెలిసి స్వామీజీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు కదా ...

ఇప్పుడు ఊళ్ళో లేరాంటావేంటి ? అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ..

అదీ .. అదీ .. ఏమో విక్కీ .. ఆయన ఊరు వెళ్తున్నారని గోపాలస్వామి వచ్చి చెప్పాడు .. అంది  గిరిజ .

ఆశ్చర్యంగా ఉందే .. అని గిరిజ కళ్ళలోకి చూసాడు విక్కీ ..

  ఇంకా ఉంది 




మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 26 June 2014

రుధిరసౌధం181



ఆ ముగ్గురి ముందు ఓ వెలుగు ప్రత్యక్షమై .. చిరునగవు తో విధాత్రి నిలబడింది ...

మీరు నా సహాయాన్ని అర్థించి నప్పటికీ శాంతియుతం గా సమస్యని పరిష్కరించారు .. మీ తెలివి పట్ల నేను

నమ్మకాన్ని మరింత పెంచుకున్నాను .. యశ్వంత్ .. రేపే పౌర్ణమి .. రచన చేతుల మీదుగా ఆలయ ద్వారం తెరువ

బడాలి .. దీపాలు వెలగాలి .. దానికోసం మీముందున్న ఒక్కొక్క ఆటంకం దానికదే తొలగించ బడుతుంది .. అన్ని

సక్రమం గా జరగబోతున్నాయి .. ఈ రెండు రోజుల్లో ప్రతి సంఘటన మిమ్మల్ని ఆశ్చర్య చకితులుగా చేస్తుంది ..

అలాగే ఓ ఆపద కూడా పొంచి ఉంది .. అన్నింటికీ సిద్ధం గా ఉండండి అంది విధాత్రి ..

తప్పుకుండా యువరాణి .. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే .. సత్సంకల్పం ముందుకు నడిపిస్తుంది అని ఇప్పటి

వరకూ మా అనుభవాలే మాకు తెలియజేసాయి ... మీ కోరిక నెరవేరుతుంది .. అన్నాడు యశ్వంత్ .

ఆమె చిరునవ్వు తో .. అవును .. నెరవేరబోతోంది ... త్వరలోనే దెయ్యాల కోట గా పిలవబడిన ఈ మహల్ ప్రేమ

సౌధం గా మారబోతుంది ... మా వంశీకుల గుర్తుగా భవిష్యత్ తరాలకి ఆహ్వానం పలకబోతుంది .. వంశాభివృద్ధి

జరగబోతుంది .. అంది విధాత్రి .

యశ్వంత్ ... శివ , మురారి లు ఆమె కి వినయంగా నమస్కరించారు .

వెళ్ళండి .. సమయం మించక ముందే మీ పని ముగించుకోండి .. అంది విధాత్రి .

అలాగే యువరాణి .. అని ముగ్గురు అక్కడ్నించి కదిలారు ...

                                                     *************************

స్నానం ముగించుకొని సరస్వతి ఇచ్చిన పరికిణి , వోణి లో తెలుగింటి అమ్మాయిలా జడ వేసుకొని అద్దం లో తనని

తాను చూసుకొంది రచన . ఆమె మొహం ఆమె కె ముద్దొచ్చింది ..

వెనక నుంచి సరస్వతి రావడం అద్దం లో కనబడే సరికి వెనక్కి తిరిగింది రచన ..

అరరె .. ఎంత అందం గా ఉన్నారు మీరు ? నా దిస్టే తగిలేలా ఉంది అని కాటుక తీసి రచన చెవి వెనకాల అద్దింది

సరస్వతి .

చిన్నగా నవ్వి .. సరస్వతీ .. తాత వచ్చాడా ? అని అడిగింది రచన .

వచ్చాడమ్మ .. యశ్వంత్ బాబు ని కలిసి వచ్చాడమ్మ .. యశ్వంత్ బాబు వాళ్లకి బాలయ్య దొరికాడంట.. ఊరందరి

ముందు అన్ని నిజాలు బయట పెట్టబోతున్నరంట .. మిమ్మల్ని , నన్ను సిద్ధం గా ఉండమన్నా రట .. బాబు

మంచితనాన్ని తాత వేనోళ్ళ పొగిడాడు .. మంచోడమ్మ  యశ్వంత్ బాబు ... ఆయన్ని ఏ పిల్ల చేసుకుంటుందో గని

చాల అడురుస్టం చేసుకుని ఉండాలా .. కదమ్మా ? అంది సరస్వతి ..

సరస్వతి మాటలకి నవ్వు వచ్చింది రచన కి ..

ఆహా .. మీ యశ్వంత్ బాబు ని చేసుకోవాలంటే అంత అదృష్టం కావాలా ? మరీ అంత లేదులే .. ఇంకో మాట చెప్పు

అంది గడుసుగా రచన .

నేను యశ్వంత్ బాబు ని అంటుంటే మీరు .. ఇలా అంటున్నారంటే .. కొంపదీసి .. యశ్వంత్ బాబు .. మా

యువరాణి  మనసు దోచుకోలేదు కదా .... అంది కొంటె గా సరస్వతి ..

సరస్వతి మాటలకి రచన బుగ్గలో సిగ్గుల మందారం పూసింది .. చిరునవ్వుతో సరస్వతి కేసి చూసింది రచన .

ఆహా .. అర్థమయిన్దమ్మా .. చాల సంతోషం .. మీ నోట్లో పంచదార పోయాలి .. తీసుకొస్తానుండండి .. అని లోపలి కి

పరుగు తీసింది సరస్వతి .

అలా పెరటి గట్టు మీదే కూర్చుని తనలో తానె నవ్వుకొంది రచన .

ఇంకా ఉంది







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 25 June 2014

రుధిరసౌధం180





యశ్ .. వీడు .. మనం కట్లు విప్పాక , బయటకి వెళ్ళిపోయాక కూడా మనం చెప్పినట్లు చేస్తాడని నమ్మకం ఏంటి ?

బయటకి వెళ్ళాక మనకే వ్యతిరేకం గా మాట్లాడొచ్చుగా .. అన్నాడు మురారి ..

లేదు మురారి .. అలా మాట్లాడడు బాలయ్య .. అని ఏం బాలయ్యా ? అలా చేస్తావ ? అన్నాడు యశ్వంత్ ..

లేదయ్యా లేదు .. నన్ను వదిలేయండి .. నేను మీరు చెప్పినట్టే చేస్తాను .. అన్నాడు బాలయ్య ..

లేదు బాలయ్యా .. నువ్వలా చెయ్యవు ? తెలివైన వాడు తప్పించుకు పోతాడు కానీ అలా చేస్తాడా ? నువ్వంత మంచి

వాడివి కావు కదా ... అన్నాడు యశ్వంత్ ..

అతడు యశ్వంత్ వైపు సందేహం గా .. అయోమయంగా చూశాడు ..

చూడు బాలయ్య .. నీ చేతికి కట్టిన ఈ రక్షదారం .. 3 గం సేపు మాత్రమె పని చేస్తుంది .. ఈ మూడు గంటలు చావు

నీ వెనకాలే వస్తుంది .. ఈ మూడు గంటల్లో నువ్వు మేము చెప్పినట్టు చేస్తే .. నిన్ను జీవితాంతం రక్షించే రక్షదారం

మేము ఇస్తాము .. ఈ మూడు గంటల్లో నీ మనసు లోకి ఎటువంటి చెడు ఆలోచన వచ్చినా .. అదే భూపతి కి

వ్యతిరేకం గా ఉండకూడదని నువ్వే పని చేయాలనుకున్నా ఈ దారం తన మహిమ ని కోల్పోతుంది .. అన్నాడు

యశ్వంత్ ...

భయంగా అతడి వైపు చూసి .. నేను మీరు చెప్పినట్టే చేస్తాను కానీ మీరు తర్వాత నన్ను రక్షించకపోతే .. అన్నాడు

బాలయ్య .

బాలయ్యా .. నీకూ మాకూ తేడా లేదా ? నువ్వు భూపతి లాంటి వాడికి కొమ్ము కాశావు ? మేము భూపతి నుంచి

ఈ ఊరిని కాపాడాలి అని భావిస్తున్నాం .. మేము మాట తప్పం .. అయినా నువ్వు మంచివాడిగా మారిపోయిన

క్షణం ఆ భగవంతుడు , ఈ ఊరి ప్రజల ఆశీర్వాదం నిన్ను కావలి కాస్తాయి .. మంచివాడిగా మారి చూడు .. ఆ

ఆనందం ఎంత ఉన్నతమైనదో నీకు అనుభవ మవుతుంది .. అన్నాడు యశ్వంత్ .

బాలయ్య కళ్ళు ఎందుకో చెమర్చాయి .. నిజమే నయ్యా ? చావు నా ముందు ఉందంటే నాకు నేను చేసిన పాపాలు

నన్ను నిలదీస్తున్నట్టు ఉందయ్యా .. మారతానయ్యా .. భూపతి చేసిన ప్రతి పాపానికి సాక్ష్యం నేనేనయ్యా .. నేను

చెప్తానయ్య .. అన్నాడు బాలయ్య .

యశ్వంత్ చిరునగవు తో శివ , మురారి ల వైపు చూశాడు ...

వారు చిరునవ్వుతో వచ్చి బాలయ్య కట్లు విప్పారు ..

కట్లు విప్పాక ముగ్గురికి నమస్కరించి .. ఈ ఊరికి మీరేం కారు .. కానీ మంచి చేయాలని అనుకుంటున్నారు ..

సమయం మించిపోకుండా రండయ్యా .. భూపతి ఇంటికాడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను .. అన్నాడు

బాలయ్య ..

అలాగే బాలయ్య .. మేమొస్తాము .. నువ్వు వెళ్ళు .. ముందుగా భూపతికి ఏం చెప్పకు .. అన్నాడు యశ్వంత్ .

తల ఊపి ముందుకి నడిచాడు బాలయ్య ..

అతడు వెళ్ళిపోయాక .. యశ్వంత్ , శివ , మురారి లు హాయిగా నవ్వుకున్నారు ..

నువ్వు వేసిన ట్రిక్ పనిచేసింది యశ్ .. అన్నాడు శివ ..

ట్రిక్ కాదు .. ఇది నమ్మకం తో కూడినది .. రాకుమారి విధాత్రీ .. మీరిక్కడే ఉన్నారని తెలుసు .. మా కళ్ళకి కని

పించండి .. అన్నాడు యశ్వంత్ చిరునవ్వుతో ..

ఇంకా ఉంది










మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday, 24 June 2014

రుధిరసౌధం 179

అది చూసి భయం గా .. అదుగో .. ఆ పిశాచి నా వైపే వస్తోంది .. నన్నెవరన్నా కాపాడండి ... అని గట్టిగా భయం తో

అరిచాడు బాలయ్య ..

యశ్వంత్ .. బాలయ్య కి అడ్డుగా నిలబడి .. ఆ సుడిగాలి వైపు చూస్తూ .. ఇతడికి మేము రక్షణ గా ఉన్నాం .. పో

ఇక్కడ్నుంచి .. అని గట్టిగా అరిచాడు యశ్వంత్ .

యశ్వంత్ .. ఈ విషయం లో విధాత్రి సహాయాన్ని కూడా వినియోగించు కున్నాడు అని మెల్లిగా చిరునవ్వు తో

అన్నాడు శివ మురారికి వినబడేట్టుగా .

అవును ... ఇప్పుడు బాలయ్య వికెట్ పడిపోతుంది చూడు అన్నాడు నవ్వుతూ మురారి .

యశ్వంత్ అలా గట్టిగా అరచేసరికి ఆ సుడిగాలి కాస్త అకస్మాత్తుగా మాయమయ్యింది ..


ఆశ్చర్యం గా యశ్వంత్ వైపు చూసి .. ఆ పిశాచం మీ మాట వింటోంది .. నమ్మలేక పోతున్నాను అన్నాడు

బాలయ్య .

చెప్పాం కదా బాలయ్యా .. మాకు బతికే అవకాశం ఉందని .. చచ్చే అవకాశం అయితే నీకే ఉంది .. నీకు మాత్రమె ..

అదీ మా రక్షణ లో నువ్వు లేకుంటే ... అన్నాడు యశ్వంత్ .

అదెలా ? మీరెలా దాన్ని ఎదుర్కొంటున్నారు ? అన్నాడు భయంగా బాలయ్య .

బాలయ్యా .. నువ్వు గమనిన్చలేదనుకుంటా .. మా చేతులకి ఎంతో మహిమ గల రక్షాదారాలు ఉన్నాయి .. ఇవే

మా ప్రాణాలని కాపాడుతున్నాయి ... కానీ నీ దగ్గర ... ఏం లేదు కదా ? అన్నాడు యశ్వంత్ వెటకారంగా ..

ఓహో .. అర్థమైంది .. నన్ను కాపాడండి .. పిల్లా పాపలు గలోడ్ని .. అన్నాడు బాలయ్య .

నిన్ను కాపాడితే మాకేంటి ? నిజం అందరి ముందు చెబుతావా ? అన్నాడు యశ్వంత్ ..

అలాగే చెబుతాను ... కానీ ఈ మహల్ దాటితే .. మళ్ళి నన్ను ఆ దెయ్యం వచ్చి ఏమైనా చేస్తుందేమో ? అన్నాడు

బాలయ్య భయం గా .

నిజమే బాలయ్యా ... ఇక్కడ తప్పించుకున్నా వన్న కసితో ఇంకా భయంకరం గా చంపేస్తుంది .. అన్నాడు

యశ్వంత్ ..

అయ్యో మరెలా ? నన్నేలాగైనా కాపాడండి .. నేను భూపతి చేసిన నేరాలన్నీ అందరి ముందు చెప్తాను .. ముందు

నన్ను కాపాడండి ? అన్నాడు బాలయ్య .

అలాగే బాలయ్య .. తప్పనిసరిగా కాపాడతాం ... అని శివ వైపు చూసి .. శివా .. మన దగ్గర ఉన్న రక్షా దారం ఇలా

ఇవ్వు .. అన్నాడు యశ్వంత్ .

శివ నవ్వునాపుకుంటూ .. ఒక దారాన్ని తీసి ఇచ్చాడు యశ్వంత్ చేతికి ...

ఆ దారం వైపు ఆశగా చూశాడు బాలయ్య .

బాలయ్యా .. ఈ దారం నిన్ను రక్షిస్తుంది .. నిన్ను ఎలాంటి పిశాచం ఏమీ చేయలేదు ... అని అతడి చేతికి దారం

కట్టాడు యశ్వంత్ ..

నమ్మకం తో అతడిలో ఆత్మ విశ్వాసం కనబడింది ...

నిన్నిప్పుడు కట్లు విప్పదీస్తాము .. కాసేపట్లో ఊరందరి ముందు మేము భూపతి ఏంటో నిరూపించ బోతున్నాం ..

నువ్వు అదే సమయం లో వచ్చి నిజాల్ని ఊరందరి ముందు బట్టబయలు చేయాలి .. అన్నాడు యశ్వంత్ .

అలాగే నయ్యా .. నన్ను విడిచిపెట్టండి .. అన్నాడు ఆశగా బాలయ్య .

ఇంకా ఉంది





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Sunday, 22 June 2014

రుధిరసౌధం 178

యశ్వంత్ మహల్ వెనుక భాగానికి చేరుకునేసరికి ఒక స్తంభానికి బాలయ్య కట్టబడి ఉన్నాడు ... భయం తో వణుకు

తున్నాడు ... మురారి ,శివ ల మొహం లో ఓ పక్క ఆనందం , మరో పక్క వాడి పట్ల కసి కనబడుతున్నాయి ..

బాలయ్య కి స్పృహ రాక ముందు .. యశ్వంత్ ఒక ఎర్రదారం పోగుని శివ , మురారి మణి కట్టు కి కట్టుకోమన్నాడు .

తానూ కట్టుకున్నాడు .. శివ , మురారి లు ఎందుకని అడగలేదు , వారికి యశ్వం
త్ పట్ల ఉన్న నమ్మకం అది ..

ఏంటీ ? వీడు నోరు విప్పుతా నంటున్నాడా ? లేక చస్తానంటూ  నఖరాలు పోతున్నాడా ? అన్నాడు యశ్వంత్

బాలయ్య ని చూస్తూ ...


యశ్వంత్ .. వీడు నిజం ఒప్పుకోడంట .. అవును మరి ... భూపతి కి కుడి భుజం కదా ... అందరిలోనూ నిజం చెప్ప

నంటు కృతజ్ఞత చూపిస్తున్నాడు భూపతికి .. అన్నాడు శివ .

ఓహ్ .. నువ్విప్పుడు రాణి మహల్లో ఉన్నావు .. నిజం చెప్పక పొతే ఇక్కడే ఉంటావు ... అన్నాడు యశ్వంత్ .

నన్నెందుకు ఇక్కడ బంధించారు ? భూపతి కి తెలిస్తే మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టరు.. అన్నాడు బాలయ్య ..

నిజమా ? కానీ ఇంత వరకు ఈ మహల్ దాటి ఎవ్వరూ ప్రాణాలతో పోలేదట గా ... ఏమంటావు బాలయ్యా ?

అన్నాడు  యశ్వంత్ ...

అవును .. అందుకే ముందు అందరం ఇక్కడ్నుంచి పోదాం .. ఇక్కడ పిశాచం మనల్ని వదలదు .. నన్నే కాదు

మిమ్మల్ని కూడా .. అన్నాడు బాలయ్య భయం గా .. అతడి కళ్ళలో గతరాత్రి దృశ్యం లీలగా కదలాడింది ..

మమ్మల్నేం చెయ్యదు .. చేస్తే నిన్నే చేయాలి .. అన్నాడు యశ్వంత్ ... వ్యంగ్యంగా

అదేంటి ? మిమ్మల్ని ఎందుకు వదిలేస్తుంది ? అన్నాడు బాలయ్య సందేహం , భయం కలగలసిన చూపుతో ..

బాలయ్యా .. ఇక్కడ పిశాచం ఉన్న మాట నిజం .. అది ఈ మహల్లో అడుగుపెట్టిన వారిని ప్రాణాలతో విడవదన్నదీ

నిజం .. ఒకవేళ మహల్ నుంచి బయట పడినా ... బయట పడిన 24 గం లో వాళ్ళు రక్తం కక్కుకుని చనిపోతారు ..

నీకు తెలుసా ? అన్నాడు యశ్వంత్ .. అతడి వైపు సూటిగా చూస్తూ ..

అయ్యో .. ఇంతవరకు బయటపడటం ఎక్కడ జరిగిందయ్యా ? అందరూ .. అందరూ .. చచ్చిపోతారు .. ఈ మహల్

దరిదాపుల్లోకి వచ్చినా సరే .. మీరేమంటే నన్ను తెచ్చి ఇక్కడ పడేశారు .. నా చావు .. నాతొ పాటు మీరు చావటం

తప్పనిసరి .. అన్నాడు బాలయ్య .. కంగారుగా ..

ఓహ్ .. కానీ బతికే అవకాశం మాదగ్గర ఉంది .. అందుకే ధైర్యంగా ఇక్కడికి వచ్చాం .. నిన్ను ఇక్కడ బంధించాం

బాలయ్యా .. అన్నాడు యశ్వంత్ .

మురారి , శివ చిరునవ్వుతో వారి సంభాషణ వింటున్నారు ..

బతుకుతారా ? ఎలాగ ? అన్నాడు చిగురిస్తున్న ఆశ తో బాలయ్య ..

మంచివారికి దైవం తోడుగా ఉంటుంది బాలయ్యా .. నువ్వు మంచిగా మారు ... భూపతి చేసిన ప్రతి అక్రుత్యానికి

నువ్వే సాక్షి వి .. అవన్నీ నువ్వు ఊర్లో అందరి ముందు చెప్పాలి ... అన్నాడు యశ్వంత్ .

లేదు .. లేదు .. అసలు ఇక్కడ్నుంచి ప్రాణాలతో వెళ్ళటమే జరగనప్పుడు నేనెలా చెప్తాను ? అన్నాడు బాలయ్య ..

ఇంతలో అక్కడ ఉవ్వెత్తున సుడిగాలి లేచి బాలయ్య వైపు రాసాగింది ..

ఇంకా ఉంది






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 20 June 2014

రుధిరసౌధం 177


ఇది నిజంగా మీ పెద్ద మనసు బాబూ ... తెల్లారు ఝామున  సరస్వతి ఇంటికి చేరిపోనాది బాబూ .. అన్నాడు తాత .

ఏంటీ సరస్వతి ఇంటికి చేరిపోయిందా ? తాతా మీరు చెబుతుంది నిజమేనా ? ఆశ్చర్యంగా అడిగాడు యశ్వంత్ .

శివ కూడా తాత వైపు ఆశ్చర్యం గా చూశాడు .

అవును బాబూ .. సరస్వతి ని , సత్యమ్మ ని ఇద్దర్ని దాత్రమ్మ .. తీసుకొచ్చింది .. ముగ్గురూ క్షేమం గా ఇంటి కాడ

ఉన్నారు .. ఆ మాట మీకు చెబుదామనే వచ్చాను .. అన్నాడు తాత .

నిజంగానా ? అంటూ యశ్వంత్ , శివ ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు .

అవును బాబూ .. సత్యమ్మ నీరసం గా ఉంది .. ధాత్రమ్మ కూడా నేనేచ్చో సరికి నిద్రపోతోంది .. బాగా అలసి పోనాది

పిల్ల ... తనకి , సరస్వతి కి తెలీదు కదా .. నిన్న ఏం జరిగిందో .. అందుకే ముందు మీరున్న ఇంటి కాడ కి వెళ్ళినారు

అక్కడ తాళం వేసుంది కదా .. పిల్లలు అందుకే సరాసరి మా ఇంటికి వచ్చేసినారు .. అన్నాడు తాత .

మంచి విషయం చెప్పావు తాత .. మా మనస్సులో భారం దింపావు .. అన్నాడు యశ్వంత్ .

యశ్వంత్ .. ముందీ విషయం నేను మురారికి చెప్పోస్తాను .. అన్నాడు ఆనందంగా శివ ..

అలాగే శివ అన్నాడు యశ్వంత్ .

బాబూ .. సరస్వతి ని భూపతే బంధించాడు ... భూపతి అన్నాయాలని  అడిగేటోల్లు లేరని ఇట్టమొచ్చినట్టు

చేస్తున్నాడు  ... మా సరస్వతి , నేను మీకు అండగా నిలబడతాం .. భూపతి తప్పు ఊరందరి మధ్య పెడదాం

అయ్యా ... అన్నాడు తాత .

తప్పకుండా తాతా ... మా దగ్గర మంచి సాక్ష్యం ఉంది .. ధాత్రి కి సిద్ధం గా ఉండమనండి ... మేము కాసేపట్లో

ఊరు లోకి వస్తాం .. భూపతి ఏంటో అందరి మధ్య నిరూపిస్తాం .. ఈలోపు భూపతి ఇంటి ముందు జనం పోగయ్యేలా

చూడు తాతా .. అన్నాడు యశ్వంత్ .

అలాగే బాబూ ... ఇన్నాళ్ళకి మీరాక వల్ల ఈ ఊరి పరిస్తితి మారితే అదే చాలు .. దానికి మీరు మా ప్రాణాలు

అడిగినా ఇస్తామయ్య .. అన్నాడు తాత ..

ప్రాణాలు ఎందుకు తాతా ... ? కొంచెం నమ్మకం .. కొంచెం ప్రేమ .. ఆ పైన మీ ఆశీర్వాదం మాకివ్వండి ? అది చాలు

అన్నాడు యశ్వంత్ .

మీ మాటలు నిజంగా చాలా సంతోషం ఇచ్చినాయయ్యా .. చాలు ... ఇప్పుడు నేనేల్తా .. పిల్లలకి మాట చెప్పాలె ..

ఊరోల్లందరినీ పోగు చేయాలే ... అన్నాడు తాత .

అలాగే తాత ... ధాత్రి , సరస్వతి లను సిద్ధం గా ఉండమనండి .. మేము వచ్చేస్తాం .. అన్నాడు యశ్వంత్ ..

అలాగే నయ్యా .. అని వెనుదిరిగాడు తాత .

ఇప్పుడుంది భూపతీ .. నీ పని సరి  ఈరోజుతో .. అందుకే అంటారు కొండ చిలువైనా చలి చీమల చేత జిక్కి చావదా

అని ... ఇప్పుడు బాలయ్య కూడా నీకు వ్యతిరేకంగా చెపుతాడు ... చెప్పేలా చేస్తాం .. అనుకున్నాడు కసిగా

యశ్వంత్ .

అతని పెదవులపై ఓ చిరునవ్వు విరిసింది ...

ముందు బాలయ్య పని చూడాలి అనుకుంటూ మహల్ వైపు నడిచాడు యశ్వంత్ .

ఇంకా ఉంది






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది