Powered By Blogger

Sunday 27 November 2022

కరోనా కథలు

 
హలో .. హలో .. వినిపిస్తుందా .. రేవతి హాస్పిటల్ యేనా .. కంగారుగా అడిగింది అర్చన . 

హా .. రేవతి హాస్పిటల్ .. చెప్పండి .. అంది అవతలివైపు స్త్రీ కంఠం నీరసం గా . 

మా మావగారికి ఊపిరి ఆడటం లేదు కొంచెం అంబులెన్సు పంపిస్తారా .. అడిగింది ఆశగా . 

మేడం .. పరిస్థితి తెలుసు కదండీ .. ఇప్పుడు వీలు కాదు . హాస్పిటల్ లో బెడ్స్ కూడా లేవు .. మీరింకో హాస్పిటల్ కి ఫోన్ చేయండి . .. అందామె 

అది కాదండీ .. అని అర్చన అనేలోపే ఫోన్ పెట్టేసిన శబ్దం .. 

నిరాశగా ఫోన్ వైపు చూసి ..తన వంకే చూస్తున్న అత్తగారికేసి చూసి .. తల అడ్డంగా ఊపింది . 

దేవుడా .. ఏమిటీ పరీక్ష .. కళ్ళ నిండా నీళ్లతో సోఫాలో కూలబడి పోయింది పార్వతి . 

ఏ హాస్పిటల్ కి కాల్ చేసిన ఇదే రెస్పాన్స్ ... ఇప్పుడేం చేయాలి ? అని ఆలోచిస్తూ .. తాను అత్తగారి ఎదురుగా కూర్చుని ... 

అత్తయ్యా .... మీరు కంగారు పడకండి .. నేను ఏదో ఒకటి చేస్తాను .. అని మళ్ళి ఫోన్ పట్టుకుంది 
అర్చన . 

అమ్మా ..అర్చనా .. అసలే పరిస్థితులు బాగులేవు ,,ఈ మాయదారి రోగం తో జనాలు చచ్చిపోతున్నారు అంటే వినకుండా బయటకి వెళ్లారు .. సేవ చేయలేకపోతున్నాం .. కళ్లారా ఆయన బాధ చూడలేకున్నాం .. ఏమిటమ్మా ఈ నరకం .. కన్నీళ్లతో అంది పార్వతి . 

అర్చన కి తెలుసు .. వయసు రీత్యా అతడి పరిస్థితి కూడా చెప్పలేము . ఇంట్లో రెండేళ్ల బాబు ఉన్నాడు .. ఆమె భర్త శ్రీధర్ విదేశాల్లో ఉన్నాడు . విమాన రాకపోకలు కూడా ఆపేయటం తో అతగాడు ఇండియా కి రావటమూ అయ్యేపని కాదు ... అర్చన కూడా ఒక ఐటీ కంపెనీ ఉద్యోగి . 
ప్రస్తుతం ఇంట్లోంచి పనిచేసుకునే వెసులుబాటు ఉన్నా .. 

మావగారికి కోవిడ్ సోకటంతో వాళ్ళింట్లో తీవ్రమైన ఒత్తిడి కి లోనైంది . తమని తాము కాపాడుకుంటూ అతడిని చూసుకోవాల్సిన బాధ్యత . ఇంకోపక్క భర్త మీద బెంగ గా ఉంది . 

ఇంకే హాస్పిటల్ కి కాల్ చేద్దామా అని గూగుల్ లో చెక్ చేస్తున్న ఆమె కి .. ఈలోపు తన కొలీగ్ వీరేంద్ర నుండి ఫోన్ వచ్చింది . 

వెంటనే లిఫ్ట్ చేసి .. వీరేంద్ర .. అంది అర్చన . 

అర్చన .. ఎలా ఉన్నారు మీ అంకుల్ ? అన్నాడు వీరేంద్ర . 

పరిస్థితి బాగులేదు .. ఎవరైనా అంబులెన్సు పంపిస్తే వెంటనే హాస్పిటల్ లో చేరుద్దామంటే 

ఎక్కడ అవకాశమే లేదంటున్నారు ... అంది జీరబోతున్న గొంతు తో . 

ఇమేజ్ హాస్పిటల్ కి కాల్ చేశాను అర్చన .. కానీ ఒకరోజు కి లక్ష రూపాయలు ఖర్చు కావొచ్చు . 
అయినప్పటికీ నమ్మకం లేదు .. 
ఏం చేద్దామంటావ్ ? ఏదో ఒక నిర్ణయం తీసుకుని చెప్పు అన్నాడు వీరేంద్ర . 

శ్రీధర్ ని అడగాలి .. నేను నీకు ఫోన్ చేస్తాను అంది మెల్లిగా . 
సరే .. అని పెట్టేసాడు వీరేంద్ర . 

అర్చనా ... ఏమైనా దారి దొరికిందా అమ్మ .. ఆశగా అడిగింది పార్వతి . 

ఒక్క నిమిషం అత్తయ్యా .. అని శ్రీధర్ కి కాల్ చేసింది అర్చన . 
అటువైపు శ్రీధర్ .. జీరబోతున్న గొంతుతో అర్చనా .. అన్నాడు . 

ఏవండీ .... అంది గాద్గదిక స్వరం తో .. 
నాన్నగారు ..  అని ఆగిపోయాడు శ్రీధర్ .. 
మీ గొంతు ఏంటి అలా ఉంది .. మీరు బావున్నారు కదా అంది భయంగా .. 
హా .. బాగానే ఉన్నాను .. ముందక్కడి విషయం చెప్పు అన్నాడు శ్రీధర్ . 
మీరు ఇక్కడికి రావటానికి ప్రయత్నించండి .. ఎందుకో నాకు ధైర్యం సరిపోవట్లేదు అంది అర్చన . 
ప్రయత్నిస్తున్నాను అర్చనా ... ఎంబసి కి మెయిల్ చేశాను . చూద్దాం ఏమవుతుందో .. 
నాన్నగారి పరిస్థితి విషమించిందా ఏంటి ? వణుకుతున్న కంఠం తో అన్నాడు శ్రీధర్ . 

త్వరగా ఏదో స్టెప్ తీసుకోవాలి ... ఇమేజ్ హాస్పిటల్ వాళ్ళు చేర్చుకుంటారుట ... కానీ .. అని ఆగిపోయింది అర్చన . 

మన ప్రయత్నం మనం చేద్దాం అర్చన .. చేర్పించు .. మందులే లేని వ్యాధి ని వారెలా నయం చేస్తారు .. అంతా భగవంతుని దయ .. అన్నాడు శ్రీధర్ . 

సరేనండీ .. ఇప్పుడే ఫోన్ చేస్తాను . అంది అర్చన . 

అర్చనా .. మీరు టెస్ట్ చేసుకున్నారు కదా .. అమ్మ .. నువ్వు .. బాబు .. ఒకసారి చేసుకుంటే మంచిది .. అన్నాడు శ్రీధర్ . 

అలాగేనండి అంది అర్చన .. 
నేను మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను .. ఉంటాను అని పెట్టేసాడు శ్రీధర్ . 
వెంటనే ఇమేజ్ హాస్పిటల్ కి కాల్ చేసింది అర్చన ... ఒక గంట తరువాత అంబులెన్స్ వచ్చింది 
గ్రహాంతరవాసుల్లా హాస్పిటల్ సిబ్బంది వచ్చి అర్చన మావగారిని తీసుకుపోయారు 

                                  *****************************************

మరుసటిరోజు ఉదయాన్నే తన కార్ లో అత్తగారిని , కొడుకుని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లి తనతో పాటూ వారికీ టెస్ట్స్ చూపించింది . 
పార్వతి ఉదాసీనంగా ఉంది తిరుగు ప్రయాణంలో . 
ఆమెని కదిలించే ధైర్యం లేక అర్చన కూడా మౌనం గానే ఉంది . 
బాబు నిద్రపోతున్నాడు . 
వాళ్ళుండే ఏరియా కి దగ్గర్లోకి వచ్చేసరికి .. అర్చనా .. ఇంట్లో సరుకులు అయిపోయాయమ్మా .. 
అంది కార్ విండో లోంచి సూపర్ మార్కెట్ చూస్తూ . 

అందరు సూపర్ మార్కెట్ ముందు వరుసగా  దూరం దూరం గా మాస్క్ లతో నిలబడి ఉన్నారు . 

డ్రైవ్ చేస్తూనే వారి వైపు చూస్తూ .. చాలా పెద్ద క్యూ నే ఉంది అత్తయ్య . నేను ఆన్లైన్ లో తెప్పిస్తాను

అని సరాసరి తన అపార్ట్మెంట్ వైపు పొనిచ్చింది అర్చన . 

అపార్ట్మెంట్ ముందర ఓ అంబులెన్స్ ఆగివుంది .. ఎవరో చనిపోయి నట్టున్నారు .. తీసుకువెళ్తున్నారు .. ఎవరా అని చూసింది కార్ పార్కింగ్ వైపు డ్రైవ్ చేస్తూనే . 

తమ ఎదురు ఫ్లాట్ శ్రావ్య ఏడుస్తూ కనపడింది ఆమె కి . 

కార్ దిగి అత్తయ్యా .. బాబు ని తీసుకుని మీరు పైకి వెళ్ళండి అని ఫ్లాట్ కీస్ ఆమె కిచ్చి .. మాస్క్ సరి చేసుకుంటూ శ్రావ్య వైపు నడిచింది అర్చన . 

అర్చన ని చేస్తూ ఏడుపు దిగమింగుకుని .. అర్చనా .. మావారు .. అంటూ భోరుమంది . 

అయ్యో .. అని ఎప్పుడు జరిగింది శ్రావ్య అంది అర్చన . 

2గం ముందే ప్రాణం పోయింది .. ఊపిరి ఆడలేదు .. నా కళ్ళముందే .. ఆమెకి మాట రాలేదు . 

దగ్గరికి తీసుకుని ఓదార్చలేని దుస్థితి .. సాటి మనిషి కి సాయంగా ఉండలేని స్థితి .. కంటికి కనబడని ఓ జీవి ఆత్మీయుల్ని తీసుకుపోతుంటే .. ఏమి చేయలేక .. 

శ్రావ్యా ... ఏం చెప్పాలో తెలియడం లేదు .. యు బి  సేఫ్ .. అంది గొంతు పెగుల్చుకుంటూ అర్చన . 
అంత్యక్రియలు చేయటానికి కూడా ఎవరూ లేరు అర్చన .. ఆయన్ని అనాథలా పంపించేసాను . 

మావాళ్లు రావటానికి కూడా పరిస్థితులు అనుకూలించని ఈ పరిస్థితులు ఏమిటో ,, 

ఇలాంటి రోజులు వస్తాయని ఊహించలేదు అర్చనా .. అంది శ్రావ్య . 

అవును .. ఎక్కడ వారు అక్కడే .. నిర్మానుష్యంగా వీధులు .. రోడ్లు .. బయటికి రావాలంటే ఓ యుద్ధ 
సన్నాహం .. ఎప్పుడు ఎవరికీ ఏమవుతుందో అన్న భయం .. 
రేపు రిజల్ట్ వచ్చేవరకు ఇంకో టెన్షన్ .. 

శ్రావ్య .. అలానే మోకాళ్ళ పై కూలబడి ఏడుస్తుంది .. 

ఆమెని మనసారా ఓదార్చలేని నిస్సహాయ స్థితి లో అక్కడ్నించి లిఫ్ట్ వైపు కదిలింది అర్చన .. 

ఇంకా ఉంది 

Saturday 26 November 2022

సుధాభరితం






సుప్రభాత రాగాలు పాడే హేమంతం 
సుస్వరాల గీతాలాపనతో విహంగ సంగీతం .
సువాసనలతోకూడి  వీచే మలయమారుతం ..
సుగంధాలు విరజిమ్ముతూ పూసే పారిజాతం 
సుమనోహరం తలలూపుతున్న వరిచేల కమతం ..
సులేపనాల మర్దనాలు భువికి చేసే  తుషారమే సొంతం . 
సుపరిచితాలు లేలేత కిరణాలు మేనుకే సమ్మతం 
సుదూరతీరాన సూరీడి ఏకాంతం..
సురాసురలోకానా వినవచ్చే ఆద్యంతం 
సువర్ణ వర్ణాన  ఆ భానుని చూసే సూర్య కాంతం  .
సుకుమారి అవని పలికే మనసారా స్వాగతం .
సుదినమే నేడు అంటూ పలికే మాటే సుధాభరితం










మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

ప్రతిరోజు సుప్రభాతమే..


ప్రతిరోజు సుప్రభాతమే..
ప్రతి పలుకు చైత్రగీతమే ..
ప్రతి మనసు నవనీతమే .
ప్రతి ఆశ మౌనరాగమే..
ప్రతి శ్వాస వాయులీనమే 
ప్రతి తలపు వెతికే హృదయమే 
ప్రతీ మలుపు జీవన గమనమే
ప్రతి పిలుపు జీవిత మధురిమే
ప్రతి గాధ అనురాగ ప్రభందమే
ప్రతి క్షణం నిలిచే స్మృతిపథమే
ప్రతి నిన్న మారే ఙ్నాపకమే
ప్రతి రేపు ఊరించే స్వప్నమే
ప్రతినేడు కమ్మని ఓ నిజమే
ప్రతి మనిషి బ్రతుకున సత్యమిదే