యశ్వంత్ కి ఎందుకో అనుమానం వచ్చి పైకి చూసాడు .. తమ వైపే చూస్తున్న ఆ భయంకర మైన కన్ను ప్రళయ
భయానకం గా కనబడింది .. యశ్వంత్ .. పైకి చూడటాన్ని గమనించి రచన ఏమిటా అని చూసింది .. ఆమెకేం
కనబడలేదు . మళ్ళి కిందకి చూసింది .. దిక్సూచి తిరగడం ఆపి దక్షిణం వైపు చూపించింది ..
యష్ .. సంతోషం గా అరచింది రచన .
నుదుటికి పట్టిన చెమటని తుడుచుకొని ఆమె వైపు చూసాడు యశ్వంత్ .
ఇది దక్షిణం వైపు చూపిస్తుంది .. అన్నది రచన .
ఓకే .. అని మళ్ళి పైకి చూసాడు యశ్వంత్ . అంతా మామూలు గానే ఉంది .
యశ్వంత్ .. ఏమయింది ? ఎందుకలా పైకి చూస్తున్నావు ? అనుమానం గా అడిగింది రచన .
అబ్బే .. ఏం లేదు .. అని లేచి నిల్చున్నాడు .. ఇంతలో హృదయ విదారకం గా వైజయంతి గదిలోంచి ఓ ఏడుపు
వినిపించింది .. ఆ ఏడుపు వింటుంటే అది చెవిలో రంపపు కోతలా ఉంది ..
యష్ .. అంది భయంగా రచన .
రచనా .. భయపడకు .. ఏవీ నిజాలు కాదు . మనల్ని దారి తప్పించడానికే అంతా .. మన మనస్థైర్యమె మనల్ని
కాపాడుతుంది . అని దిక్సూచి దక్షిణం వైపు చూపించింది అన్నావు కదా .. ఇటు వైపు దక్షిణం అంటే .. మేడ మీదకి
వెళ్ళటానికి మెట్లు ఉన్నాయి .. కానీ మనం ఈ మహల్ ని ఓసారి చూశాం కదా .. మహల్లొపల ఆలయం ఎక్కడ
ఉండి ఉంటుంది .. అని ఆలోచనలో పడ్డాడు యశ్వంత్ .
యష్ .. నాకర్థ మైంది .. ఆలయం భవనం లో లేదు .. భవనం వెనుక వైపు .. మనం భవనం వెనుక వైపు వెతకాలి ..
అంది రచన .
రచనా ... ఐతే పద .. భవనం వెనుకకే వెళ్దాం అని గుమ్మం వైపు నడవబోతుండగా తలుపులు పెద్ద శబ్దం చేస్తూ
మూసుకున్నాయి .
ఓహ్ గాడ్ .. మనం బయటికి వెళ్ళకుండా తలుపులు మూసేసింది ఈ వైజయంతి .. పళ్ళు కొరుకుతూ అంది రచన .
ఏం ఫర్వాలేదు . భవనం లోపలి నుంచి కూడా వెనుక భాగం వైపు వెళ్ళడానికి ఖచ్చితం గా ఆస్కారం ఉండి
ఉంటుంది .. మనం లోపలనుంచే చూద్దాం రచనా .. అని రచన వైపు చూసాడు యశ్వంత్ .
ఆమె ఎందుకో బిగుసుకు పోయి ఉంది .
రచనా ఏమయింది ? అని ఆమె చూపు నిలిచిన వైపు చూసాడు యశ్వంత్ ..
మెట్ల మీద నల్లని బట్టల్లో జుట్టు విరబోసుకుని ఓ స్త్రీ వీరి వైపే చూస్తుంది ..
యశ్వంత్ రోమాలు నిక్కబొడుచు కున్నాయి .. నాలుక తడి ఆరిపోయింది .. ఆమె కళ్ళలో నల్ల గుడ్లు కనబడటం
లేదు .. రచనా .. ఆమె .. ఆమె .. దెయ్యం కదూ ... మెల్లిగా అన్నాడు యశ్వంత్ .
రచన కూడా .. మాట రాక స్థానువై ఉండిపోవటం తో అయోమయం గా తల ఊపింది .
సినిమాల్లో తెల్ల చీర కడతారు .. ఇక్కడేంటి ఈవిడ నల్లగా ... అని యశ్వంత్ అనబోతుండగా .. ష్ అంది రచన .
లేనిపోని ధైర్యం తెచ్చుకుంటూ .. మమ్మల్ని భయపెడదామని అనుకుంటున్నావా ? అంది రచన .
ఆ స్త్రీ భయంకరం గా అరచింది .. ఎంతలా అంటే వీళ్ళిద్దరి గుండె ఆగిపోయినంత పనయ్యింది ..
అయ్యో .. ఏం జరగబోతుంది ఇప్పుడు ? విధాత్రి రాదేం .. ఇప్పుడు ఈ వైజయంతి ఏం చేస్తుందో మమ్మల్ని ...
బయటికి దైర్యం గా ఉన్నా లోపల మాత్రం తడసి పోతుంది .. అనుకున్నాడు యశ్వంత్ మనసులోనే ..
కానీ రచన ని చూసి ఆశ్చర్య చకితుడయ్యాడు యశ్వంత్ ..
ఆమె మొహం లో మెల్లిగా భయపు ఛాయలు మాయమై ధైర్యం గా అంది .. ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకో ...
వైజయంతీ ... ఈ మహల్ ని నువ్వు వీడి వెళ్ళే రోజు దగ్గరలోనే ఉంది ... అంది రచన ..
ఆ స్త్రీ గొంతు భయంకరం గా పలికింది ...
కానివ్వను ... మీకు దక్కనివ్వను .. నాది కానిది మీది కానివ్వను . నీ ప్రాణం తీస్తా ... అంది ఆ స్త్రీ ..
ఆ .. రా .. అని రెండు అడుగులు ముందుకి వేసింది రచన .
వచ్చి నా ప్రాణాలు తీసుకో .. నీకూ తెలుసు .. నువ్వు అందరి ప్రాణాలు తీసినట్లు నా ప్రాణం తీయలేవని .. అంతే
కాదు .. వైష్ణవీ మాత ఆలయం కూడా నా ద్వారానే తిరిగి తెరవ బడుతుందని కూడా నీకు తెలుసు .. ప్రేతాత్మ గా
ఇంకెన్నాళ్ళు కాలం వెల్లదీస్తావు .. ప్రాణం పోయినా ఈ మహల్ మీద మమకారం చావదా నీకూ ? ఆవేశం గా
ప్రశ్నించింది రచన .
మంత్ర ముగ్ధుడై రచన వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు యశ్వంత్ .. ఈమె రచనా లేక విధాత్రా ? అని .
(ఇంకా ఉంది )




1 comment:
nice and interesting too
Post a Comment