కడలి కెరటమై పైకి ఎగసి అశక్తత తో నేల తాకి మళ్ళి తల్లి సంద్రం లో కలసి పోయా ...
ఋణ పడినట్లు తీరాన్ని మళ్ళి మళ్ళి పలకరిస్తూనే ఉండిపోయా ..
పైకి ఎగసే ఆశా చావదు .. నింగి తాక లేక నిరాశ కమ్ముకోకా మానదు ..
పాల నురుగుని చిమ్ముతూ ఒడ్డు చేరాలని పరుగు పెడతా ..
నీకంత మిడిసి పాటు తగదె అని సంద్రపు చేయి నన్ను వెనక్కి లాగుతూనే ఉంటుంది
పెంకి అలలా మరలా తీరాన్ని చేరుతా .. నేల పై రాసిన రాతల్ని చెరిపేస్తా ..

నింగి వంక ఆశగా చూస్తా .. సూరీడు తో దోస్తీ కడతా ... భానుడి వలపుతో
వేడెక్కిన హృదయం తో గగనాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తా ..
తొందరపాటు తో సర్వస్వం అర్పించి ఆశలు ఆవిరై మేఘమై పోయా ..
గూడు కట్టిన కన్నీటిని గుండెలో దాచి పశ్చాత్తాపం తో అమ్మ వంక ఆశ గా చూసా ..
ఎంత జాలి గలదో కడలి తల్లి,, తన ప్రేమ చిరుగాలిలా నన్ను తాకింది ..
ఇక ఆగలేక బాధతో కరిగిపోయి కన్నీరుగా వర్షించి అమ్మ వొడిలో ముత్యం లా వొదిగిపోయా ..

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది


No comments:
Post a Comment